పామూరు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన అంబటి కొండారెడ్డిని నియమించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ తనకు పదవి రావడానికి సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ, పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ దద్దాల నారాయణయాదవ్, మండలపార్టీ అధ్యక్షుడు గంగసాని హుసేన్‌రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంబటికి పలువురు అభినందనలు తెలిపారు.
మార్కాపురం: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలానికి వెళ్లే భక్తుల కోసం మార్కాపురం డిపో నుంచి 25 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డిపో మేనేజరు లావణ్య తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం నుంచే శ్రీశైలానికి మార్కాపురం డిపో నుంచి ప్రత్యేక బస్సులను ప్రారంభించామని, ప్రతి రోజూ 5 నుంచి 6 బస్సులను ప్రయాణికుల కోసం నడుపుతున్నామన్నారు. రైల్వేస్టేషన్, బస్టాండు నుంచి ఈ బస్సులు వెళ్తాయన్నారు. ఈనెల 19 నుంచి 25 బస్సులు శ్రీశైలానికి మాత్రమే వెళ్తాయని, అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచుతామని ఆమె చెప్పారు. ఈనెల 18వ తేదీ పెద్దారవీడు మండలంలో జరిగే కాటంరాజు తిరునాళ్లకు మార్కాపురం డిపో నుంచి 13 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులు వెళ్లాలని చెప్పారు. అవసరమైతే కాటంరాజు గుడి వద్దకు ఇంకా బస్సుల సంఖ్యను పెంచుతామని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం, శనివారాల్లో శ్రీశైలానికి వెళ్లే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నల్లమల ఘాట్ రోడ్డు మొత్తం కర్నాటక నుంచి వచ్చే భక్తులతో, శివన్నామస్మరణతో మార్మోగుతోంది.
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలోని గ్యాస్ వినయోగదారుల సమస్యల పరిష్కారానికి జిల్లా కంట్రోల్ రూంను ఒంగోలు ప్రకాశం భవన్‌లోని కలెక్టర్ కాన్ఫరెన్సు హాలులో నం:1077ను ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి ఎస్ పద్మ శ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో జిల్లా యంత్రాంగం గ్యాస్ సరఫరా పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. గృహ అవసరాలకు, అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరా నిరంతరం జరుగుతుందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతుల కారణంగా రీఫిల్ బుకింగ్‌లు పెరిగినా మొదట బుక్ చేసిన వారికి మొదట అందిస్తారన్నారు. వినియోగదారులు ఒకే సారి ఎక్కువగా గ్యాస్ బుకింగ్‌లను చేయడం వలన సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలిపారు. గ్యాస్‌ను వాట్సాప్, మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చన్నారు.


