ప్రజారోగ్యం కంటే కార్పొరేట్ల అభివృద్ధే ముఖ్యమా ? | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యం కంటే కార్పొరేట్ల అభివృద్ధే ముఖ్యమా ?

Mar 15 2026 4:54 AM | Updated on Mar 15 2026 4:54 AM

● ఎమ్మెల్సీ బి.గోపి మూర్తి

ఒంగోలు టౌన్‌: పాలకులు ప్రజల ఆరోగ్యం కంటే కార్పొరేట్ల అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బి.గోపి మూర్తి ఽవిమర్శించారు. నూతన ఆర్ధిక విధానాల అమలు తరువాత విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటుపరమైందని, నిరుపేదలకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారిపోయాయని చెప్పారు. నగరంలోని అంబేడ్కర్‌ భవనంలో శనివారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ 40వ రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపిమూర్తి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం సూపర్‌ జీఎస్టీ సూపర్‌ సేవింగ్స్‌ పేరుతో నానా హంగామా చేసిందని, అంతటి బూటకం మరొకటి లేదని చెప్పారు. మెడికల్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ హక్కులను హరించే లేబర్‌ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. మందులపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేసి ఔషధాల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలను పునరుద్ధరించాలని, ప్రజారోగ్యానికి కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని కోరారు. ప్రజారోగ్యం బాధ్యతల నుంచి తప్పుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ జపం చేస్తోందని, మెడికల్‌ కళాశాలలను ప్రభుత్వమే నేరుగా నిర్మించి నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ రమణయ్య మాట్లాడుతూ.. పేదలకు మందులు ఉచితంగా అందజేయాలని, ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మతోన్మాద, కార్పొరేట్‌ అనుకూల విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఎఫ్‌ఎంఆర్‌ఏఐ జాతీయ అధ్యక్షుడు కృష్ణానంద్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా వివరించారు. ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై యూనియన్‌ పోరాటాలు చేస్తుందని తెలిపారు. సభలో కె.సీతారామయ్య, సీహెచ్‌ వెంకటరావు, సీహెచ్‌ కుమార్‌, జి.శ్రీనివాస్‌, ఎం.అయ్యపురెడ్డి, ఈదర అన్నపూర్ణ, ఎం.రమేష్‌, కాలం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement