ఒంగోలు సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక తెలిపారు. శనివారం విద్యాశాఖ అదనపు సంచాలకుడు, జిల్లా పరిశీలకుడు ఏ.సుబ్బారెడ్డి, పరీక్షల నిర్వహణ విభాగ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావులతో కలిసి ఆమె ఒంగోలు సంతపేటలోని డీఆర్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఈఓ రేణుక మాట్లాడుతూ ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రెగ్యులర్ విభాగ పరీక్షలు, 16 నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు, ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటాయని తెలిపారు. ఇవి విద్యాపరమైన పరీక్షలు కాబట్టి 30 నిమిషాలు ఆలస్యమైనా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక వసతులు కల్పించామన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం తగిన రవాణా సౌకర్యం కల్పించామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఉందన్నారు. హాల్ టికెట్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా పరీక్ష కేంద్రాన్ని గుర్తించవచ్చని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్ లను మూసివేయిస్తామని, పోలీసుల ద్వారా అవసరమైన బందోబస్తు కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
పరీక్షల నిర్వహణ ఇలా...
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పదో తరగతి రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలకు మొత్తం 28,632 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు డీఈఓ తెలిపారు. వీరిలో రెగ్యులర్ విభాగంలో 14,289 మంది బాలురు, 14,312 మంది బాలికలు ఉన్నట్లు చెప్పారు. ప్రైవేట్ విభాగంలో 21 మంది బాలురు, 10 బాలికలు ఉన్నారన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి రెగ్యులర్, ఒకసారి ఫెయిల్ అయిన వారు 1144 మంది ఉన్నట్లు తెలిపారు. వీరిలో 823 మంది బాలురు, 321 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల కోసం 165 సెంటర్లను, ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల కోసం 14 సెంటర్లను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. పబ్లిక్ పరీక్షలు ముగిశాక ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ ఉంటుందన్నారు.


