జేసీ శ్రీనివాసులు
మార్కాపురం టౌన్: వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు కేటాయించిన పునరావాస కాలనీల్లో పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, మార్కాపురం, అర్ధవీడు, పెద్దారవీడు మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ఇంత వరకూ ఎంత నగదు చెల్లించారు. ఇంకా చెల్లించాల్సిన నగదు అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ ఏడాది జూలై నాటికి ప్రాజెక్టు ద్వారా నీరొస్తే గ్రామాల పరిస్థితి, రోడ్ల అనుసంధానం, ఇతర మార్గాలపై చర్చించారు. పునరావాస కాలనీల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించాలని, రెండు రోజుల్లో నివేదిక సిద్ధం చేయాలని, నివేదికను బట్టి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని తెలిపారు. పెద్దారవీడు మండలంలోని వీఆర్‌ఓలు పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్జీదారులను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వెలిగొండ ప్రాజెక్టు ఎస్‌ఈ అబూత్ అలీం, మార్కాపురం ఎస్‌డీసీ సత్యనారాయణ, కనిగిరి ఆర్డీఓ శివరామిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


