ఔను..వాళ్లిద్దరూ రాజీ పడ్డారు ! | - | Sakshi
Sakshi News home page

ఔను..వాళ్లిద్దరూ రాజీ పడ్డారు !

Mar 15 2026 4:54 AM | Updated on Mar 15 2026 4:54 AM

● జాతీయ లోక్‌ అదాలత్‌లో 40 ఏళ్ల నాటి కేసు రాజీ

ఒంగోలు టౌన్‌: మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్నట్లు అన్నదమ్ముల మధ్య 40 ఏళ్లుగా ఆస్తి వివాదం కొనసాగుతోంది. ఈ కేసును శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీ మార్గంలో పరిష్కరించారు. ఒంగోలు రూరల్‌ మండలం కొప్పోలు గ్రామానికి చెందిన అన్నాదమ్ములు, వారి వారసుల మధ్య 1986వ సంవత్సరం నుంచి ఆస్తులకు సంబంధించి బాడుగ పంపిణీ వివాదం కొనసాగుతోంది. ఇరు వర్గాలు పట్టుదలకుపోవడంతో ఏ ఒక్కరూ ఒక మెట్టు దిగడానికి ససేమిరా అనడంతో కేసు పీఠముడి పడింది. 40 ఏళ్లుగా న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్న అన్నాదమ్ములు, వారి వారసులను పిలిపించి మాట్లాడిన ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి ఎస్‌.హేమలత సమస్యకు ఒక పరిష్కారమార్గం కనుగొన్నారు. ఇరు వర్గాలు దాన్ని ఆమోదించడమే కాకుండా జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీ పడేందుకు అంగీకరించారు. ఎట్టకేలకు 40 ఏళ్ల కేసును రాజీ మార్గంలో పరిష్కరించడంతో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇరువర్గాలు రాజీపడినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ఇన్‌చార్జి న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి ప్రకటించారు.

లోక్‌అదాలత్‌లో 16,860 కేసుల పరిష్కారం

ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో మొత్తం 16,615 కేసులను పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ఇన్‌చార్జి న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి ప్రకటించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి లోక్‌ అదాలత్‌ కేసుల వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అన్నీ న్యాయస్థానాల్లో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 231 సివిల్‌ కేసులు, 16,615 క్రిమినల్‌ కేసులు, 14 పీఎల్‌సీ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కక్షిదారులకు సుమారుగా రూ.5 కోట్ల పరిహారం ఇప్పించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 27 బెంచీల్లో వ్యాజ్యాల పరిష్కారానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు సహకరించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement