గూడు కూల్చి.. గుండె పగలకొట్టి..! | - | Sakshi
Sakshi News home page

గూడు కూల్చి.. గుండె పగలకొట్టి..!

Feb 6 2026 8:35 AM | Updated on Feb 6 2026 8:35 AM

గూడు

గూడు కూల్చి.. గుండె పగలకొట్టి..!

కార్మిక నగర్‌లో బుధవారం రాత్రి జేసీబీలతో దాష్టీకం

అధికార పార్టీ అండదండలతో 200 మంది ప్రైవేటు సైన్యంతో ఇళ్ల కూల్చివేత

ఇళ్లను కూల్చివేశాం...అడ్డుతొలగకపోతే రేపు మనుషులను కూల్చేస్తామంటూ హెచ్చరికలు

న్యాయం చేస్తారని ఓటేస్తే నిలువ నీడలేకుండా చేశారని నిర్వాసితుల కన్నీరు

మాకు ఎలాంటి సమాచారం లేదంటున్న రెవెన్యూ అధికారులు

బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్న తాలుకా సీఐ

అధికారుల తీరుపై బాధితుల ఆగ్రహం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

శాబ్దం క్రితం ఊరికి ఉత్తరాన దూరంగా విసిరేసినట్లున్న ప్రాంతం అది. ముక్తినూతలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చేసర్వే నంబర్‌ 186 లోని 12 ఎకరాల ఇనాం భూములు. నగరంలో తలదాచుకునేందుకు కాసింత చోటు లేని 60 కుటుంబాలకు చెందిన నిరుపేద ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కనీసం గుడిసెలేసుకునే తాహతు కూడా లేక చిరిగి పోయిన పాత చీరలను చుట్టూ కట్టేసుకొని లోపల నివాసం ఉంటున్నారు. కాలక్రమంలో రేకుల షెడ్డులు వేసుకున్నారు. అప్పో సప్పో చేసిన ఒకరిద్దిరు పక్కా గృహాలు నిర్మించుకున్నారు. అయితే ఇటీవల ఈ భూముల ధరలు భారీగా పెరిగాయి. వందల కోట్ల రూపాయలకు పెరిగిన ఈ భూములపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. ఎలాగైనా దీన్ని కాజేయాలని ప్లాన్‌ చేసుకున్నారు. అందుకు దొడ్డి దారిన డాక్యుమెంట్లు సృష్టించుకున్నారు. ఇనాం భూములను రిజిస్టర్‌ భూములుగా చెబుతూ కాలనీపై పడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. నిజానికి ఈ భూములను ఇప్పటి వరకు ఎవరూ క్లయిమ్‌ చేసుకోలేదని, నిబంధనల ప్రకారం ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ తరువాత అక్కడ పదేళ్లుగా నివాసం ఉంటున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు చెబుతున్నారు. ఇనాం భూములను ఎవరికై నా సరే ఎలా రిజిస్టర్‌ చేస్తారని వాదిస్తున్నారు. పేదల భూములపై కన్నేసిన అధికార పార్టీ నాయకులు ఒక వ్యూహం ప్రకారం భూముల కబ్జాకు పాల్పడ్డారని, అందులో భాగంగానే పదేళ్లుగా నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్లను అక్రమంగా కూల్చేశారని ఆరోపిస్తున్నారు.

కరెంటు, మంచినీరు లేకపోయినా...

నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేదలు 11 ఏళ్ల క్రితం నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. ఇక్కడ 60 కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరిలో 15 ఎస్సీ కుటుంబాలు, 30 బీసీ కుటుంబాలు, 12 మైనార్టీ, 4 ఓసీ కుటుంబాలకు చెందిన వారున్నారు. వంటపని, ఇళ్లలో పాచిపనులు, హోటళ్లు, హాస్పిటళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి కనీస సౌకర్యాలు లేవు. మంచినీటి కొళాయిలు, విద్యుత్‌ సౌకర్యం లేదు. రాత్రయ్యే సరికల్లా గుడ్డి దీపాలు వెలిగించుకొని బిక్కు బిక్కుమని బతుకులు వెళ్లదీస్తున్నారు. తరుచూ ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తుంటాయి. దాంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పిల్లాపాపలను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నారు. మోంథా తుఫాను సమయంలో కాలనీ నీట మునిగింది. అయినా సరే నీళ్లు తోడేసుకొన్నారు. తలదాచుకునేందుకు మరో అవకాశం లేకపోవడంతో ఇక్కడ జీవిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా తమకు పట్టాలు ఇవ్వాలని నాయకుల చుట్టూ తిరుగుతున్నట్లు కన్నీరు పెట్టుకున్నారు. గత ఎన్నికలకు ముందు మేము గెలిస్తే మీకు న్యాయం చేస్తానంటూ కూటమి నాయకులు చెప్పారని, నమ్మి ఓట్లేసి గెలిపిస్తే నెత్తిమీద నీడలేకుండా చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే కార్మిక నగర్‌ను నేలమట్టం చేశారని ఇక్కడి మహిళలు వాపోతున్నారు.

మేమేం పాపం చేశామయ్యా...

నా భర్త అనారోగ్యంతో ఉన్నారు. మాకు ఇద్దరు పిల్లలున్నారు. 11 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాం. కూలీనాలి చేసుకొని బతుకుతున్నాం. కరెంటు లేదు. మంచినీళ్లు రావు. అయినా సరే గతి లేక ఇక్కడే సర్దుకొని జీవిస్తున్నాం. మాకు పట్టాలు ఇచ్చి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నాయకుల చుట్టూ తిరుగుతున్నాం. అదిగో ఇదిగో అంటూ చెబుతూ వచ్చారు. కానీ ఇంత పెద్ద కుట్ర చేస్తారని అనుకోలేదు. కట్టుకునే దుస్తులు, సామాన్లు కూడా తీసుకోకుండా ఇళ్లు కూల్చేయడానికి మేమేం పాపం చేశామయ్యా. ఇంత కక్ష ఎందుకు. నిరుపేదలకు పొట్టగొడితే మీకేం వస్తుంది. అయ్యా ..మాకు న్యాయం చేయండి. అన్యాయంగా మా ఇళ్లు కూల్చేసిన వారిని కఠినంగా శిక్షించండి. – షేక్‌ షంషాద్‌ బేగం

మా పార్టీ అధికారంలో ఉంది, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని బెదిరింపులు

గూడు కూల్చి.. గుండె పగలకొట్టి..!1
1/1

గూడు కూల్చి.. గుండె పగలకొట్టి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement