వీధి కుక్కల స్వైరవిహారం
● గురువారం ఒక్కరోజే ఏడుగురిపై దాడి
హనుమంతునిపాడు: వీధి కుక్కల స్వైరవిహారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం ఒక్క రోజే ఏడుగురిపై దాడి చేశాయి. దీంతో బాధితులంతా స్థానిక పీహెచ్‌సీకి వచ్చి వైద్యం పొందారు. మండలంలోని రశీదుపురానికి చెందిన సజ్జన్, హనుమంతునిపాడుకు చెందిన జి.తిరుపతమ్మ, నల్లగుండ్లకు చెందిన జి.హాన్సీ, వి.రత్తమ్మ, వేములపాడుకు చెందిన సీహెచ్ గంగాధర్, వాలిచర్లకు చెందిన వినయ్‌బాబు, ఎం వైశాల్యపై కుక్కలు దాడి చేయడంతో గాయాల పాలయ్యారు. ఈ మధ్య కాలంలో గ్రామాల్లో కుక్కల దాడి ఎక్కువైంది. దీంతో చిన్న పిల్లల తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపాలంటే బెంబేలెత్తిపోతున్నారు.
ఒంగోలు సబర్బన్: హరితాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంపుపై గురువారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. హరితాంధ్రప్రదేశ్ సాధనలో ప్రజలు, సంబంధిత ప్రభుత్వ శాఖలు చురుకై న పాత్ర పోషించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ ఇరిగేషన్, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, విద్య, గిరిజన, పరిశ్రమల శాఖలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థలను భాగస్వాములను చేస్తూ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అటవీ విస్తీర్ణం 37 శాతం ఉందని, దీనికి 2030 నాటికి మరో 7 శాతం జోడించాల్సి ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు సంబంధిత శాఖల నుంచి డిమాండ్‌ను తెలుసుకున్నారు. ఆ మేరకు మొక్కలు సరఫరా చేసి నాటించి, పర్యవేక్షించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. అందుబాటులో ఉన్న స్థలాలను అడవుల పెంపకానికి సమర్ధంగా వినియోగిచుకునేలా భాగస్వాములు దృష్టి సారించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో డీఎఫ్‌ఓ వినోద్‌కుమార్, డీఈఓ రేణుక, ఆర్‌ఐఓ ఆంజనేయులు, గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్, ఒంగోలు నగర కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రవినాయక్, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాస రావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలోని మరుగుదొడ్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. పలువురు ప్రయాణికులు బస్టాండ్ ఆవరణలో తమ వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని జేసీ దృష్టికి తీసుకెళ్లగా మరోసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్టాండ్ ప్రాంగణం మొత్తాన్ని శుభ్రంగా ఉంచాలని డిపో మేనేజర్ లావణ్యను ఆదేశించారు. అధిక ధరలకు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి ఉన్నారు.
సీఎస్‌పురం(పామూరు): మహాశివరాత్రి వేడుకలకు భైరవకోన, మిట్టపాలెం నారాయణస్వామి క్షేత్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లను దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రకాశం జిల్లా ఏసీ ఎం పానకాలరావు గురువారం పరిశీలించారు. భక్తులకు ఎక్కడా తాగునీటి ఇబ్బందులు, క్యూలైన్‌లలో ఇబ్బందులు, వాహన పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఏర్పాట్లపై ఈఓతో చర్చించి సూచనలు చేశారు. భైరవకోన ఆలయ చైర్మన్ ముప్పాళ్ల శ్యామ్‌సుందర్‌రాజు, సూపరింటెండెంట్ జి.శ్రీధర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ జి.ఏ.సత్యనారాయణ, చైతన్య, ఈఓ గిరిరాజు నరసింహబాబు, డిం.వంశీకృష్ణారెడ్డి ఉన్నారు.
వీధి కుక్కల స్వైరవిహారం
వీధి కుక్కల స్వైరవిహారం


