పదే పదే తప్పులు చేస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

పదే పదే తప్పులు చేస్తే కఠిన చర్యలు

Feb 6 2026 7:30 AM | Updated on Feb 6 2026 7:30 AM

పదే పదే తప్పులు చేస్తే కఠిన చర్యలు

పదే పదే తప్పులు చేస్తే కఠిన చర్యలు

మద్దిపాడు: పదే పదే తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి రెవెన్యూ శాఖ సిబ్బందిని హెచ్చరించారు. మండల కేంద్రమైన మద్దిపాడులో గురువారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టాల్లో ఏవైనా తప్పులు దొర్లితే సరి చేయించుకోవాలని రైతులను కోరారు. ఈ క్రమంలో పలువురు రైతులు తమ ఆవేదనను జాయింట్‌ కలెక్టర్‌కు విన్నవించారు. పొలం విస్తీర్ణం తక్కువగా నమోదు చేశారని, అదేమని అడిగితే మీ పొలం మేం తీసుకోవడం లేదు కదా అంటూ నిర్లక్ష్యంగా సర్వేయర్‌ సమాధానం ఇచ్చారని వాపోయారు. మరో రైతు శుద్ధపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పొలాన్ని ఆన్‌లైన్‌లో తక్కువగా నమోదు చేశారని, దీనిపై రెండుసార్లు అర్జీ ఇఛ్చినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. మరోరైతు సింగారావు తమ బంధువుల పొలం తనకు ఆన్‌లైన్‌లో ఎక్కిందని చెప్పినా సరి చేయకుండా తనతో వేలి ముద్ర వేయించుకుని పాసుపుస్తకం ఇచ్చారని తెలిపారు. ఇలా పలువురు రైతులు సమస్యలు ఏకరువు పెట్టడంతో తొలుత జేసీ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మరి కొందరు నాయకులు మాట్లాడుతూ ఎకరాకు ఐదు సెంట్లు లోపు తగ్గితే దానిని ఒప్పుకోవాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయని వీఆర్‌ఓ, సర్వేయర్‌లు చెబుతున్నారని తెలిపారు. దీందో జేసీ తొలుత వీఆర్‌ఓ, సర్వేయర్‌లపై మండిపడి వారిని ప్రశ్నించగా వారు బిక్కముఖం వేశారు. ఇన్ని తప్పులు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని తహసీల్దార్‌ ఆదిలక్ష్మి, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నలను ప్రశ్నించి అసహనం వ్యక్తం చేశారు. అనంతరం వీఆర్‌ఓ, సర్వేయర్‌కు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పలువురు విలేకరులు మాట్లాడుతూ ఇప్పటి వరకు రీ సర్వే జరిగిన గ్రామాల్లో రైతులను పిలవకుండానే రీ సర్వే పూర్తి చేశారని, దీంతో భారీగా తప్పులు నమోదయ్యాయని చెప్పారు. దీనికి జేసీ స్పందించి ఇప్పటి వరకు రీ సర్వే జరిగిన గ్రామాల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని, రీ సర్వే జరగనున్న గ్రామాల్లో తప్పులు లేకుండా పర్యవేక్షించాలని తహసీల్దార్‌, ఆర్‌డీఓను ఆదేశించారు. రీ సర్వే సమయంలో రైతులను నగదు కోసం పీడించినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని, ఈ విషయంలో ఆర్‌డీఓ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ఎవరికీ మినహాయింపు లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు

జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి

పాస్‌పుస్తకాల్లో తప్పులపై వీఆర్‌ఓ, సర్వేయర్‌పై మండిపాటు

మీరేం చేస్తున్నారని తహసీల్దార్‌, ఆర్‌డీఓపై అసహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement