జగనన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం
● వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో అన్నా
కొనకనమిట్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా మనమందరం పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి, తువ్వపాడు, కాట్రగుంట పంచాయతీ ఓబులరెడ్డిపల్లి గ్రామాల్లో గురువారం సాయంత్రం నిర్వహించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ గ్రామ కమిటీలు పటిష్టంగా ఉండాలని, కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఉన్న వ్యక్తిగత వర్గ విభేదాలు విడనాడి పార్టీ విజయమే లక్ష్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కార్యకర్తల కోసం పోరాడేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే దిశగా అక్రమ కేసులు పెట్టి క్షణికానందం పొందుతున్నారని, అవి ఇంకెంతోకాలం సాగవని కూటమి నాయకులు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దోచుకో..దాచుకో అనే విధానంతో ముందుకెళ్తోందని, బాబు పాలనలో వ్యవస్థల్లో అవినీతి పెరిగిపోయిందని అన్నా ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు శక్తులకు దోచిపెట్టేందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం చేపట్టి వారు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా మనం ప్రజల్లోకి తీసుకెళదామన్నారు. ముందుగా ఆయా గ్రామాల్లో గ్రామ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కొండారెడ్డి, మందలపు శ్రీనివాసులరెడ్డి, రాజాల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నాయకులకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, వైస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణయాదవ్, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షుడు మోరా శంకర్‌రెడ్డి, తువ్వపాడు సర్పంచ్ శిలువకుమారి, విద్యార్థి విభాగం నియోజకవర్గ కన్వీనర్ ఏలూరి సంజీవరెడ్డి, పార్టీ అనుబంధ విభాగల సభ్యులు గంగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కందెర పెద్దన్న, కుమ్మరి రమణయ్య, చిరుగూరి కోటేశ్వరరావు, మంచికల కోటేశ్వరరావు పాల్గొన్నారు.


