సహజీవనం చేస్తున్న మహిళపై దాష్టీకం
బిట్రగుంట / కావలి రూరల్: బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో అద్దెకు ఉంటున్న లోకో పైలెట్ గుంజి వెంకటశేషారావు తనతో సహజీవనం చేస్తున్న మహిళపై దాష్టీకానికి ఒడిగట్టాడు. కావలి పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ గురువారం కేసు పూర్వాపరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా నాగులప్పలపాడుకు చెందిన గుంజి వెంకటశేషారావు లోకో పైలెట్‌గా పనిచేస్తున్నారు. అతనికి కావలికి చెందిన శ్రీలేఖతో వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య భర్తలు ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకోగా కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో సుమారు మూడేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా విశాఖపట్నంలోని చిన్నముసిడివాడకు చెందిన కరుణకుమారితో పరిచయం ఏర్పడింది. వెంకటశేషారావు బిట్రగుంటలోనే లోకో పైలెట్‌గా విధులు నిర్వహిస్తుండటంతో గతేడాది జూన్ నుంచి విశ్వనాథరావుపేటలో భార్య భర్తలుగా ఇల్లు అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. ఈ క్రమంలో వెంకటశేషారావు కావలిలో ఉంటున్న తన పిల్లలను చూసేందుకు వెళ్లిన ప్రతీసారి కరుణకుమారితో గొడవ జరిగేది. బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన వెంకటశేషారావుకు కరుణకుమారితో మరోమారు గొడవ జరిగింది. దీంతో కూరగాయలు కోసే కత్తితో కరుణకుమారిపై దారుణంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు తొలుత కావలి ఏరియా వైద్యశాలకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటున్నట్లు తెలిసింది. కాగా గర్భిణిపై కత్తితో దాడి అంటూ సోషల్ మీడియాలో, ఇతర మీడియాల్లో వస్తున్న కథనాలను పోలీసులు ఖండించారు.
ఒంగోలు టౌన్: జె.పంగులూరు మండలం కొండమూరు గ్రామం వద్ద 2019లో జరిగిన హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ఒంగోలు మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొండమూరు గ్రామానికి చెందిన చిలమకూరి అనంతరెడ్డి(33)కి అదే గ్రామానికి చెందిన చిలమకూరి వెంకట కృష్ణారెడ్డికి మధ్య చాలా కాలంగా భూ వివాదం ఉంది. ఈ క్రమంలో అనంతరెడ్డి నిర్మించిన కాంపౌండ్ వాల్‌తో కృష్ణారెడ్డి మరింత పగ పెంచుకున్నాడు. 2019 ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో అనంతరెడ్డి స్నేహితుడితో కలిసి మోటారు బైకుపై రేణంగివరం గ్రామం నుంచి కొండమూరు వెళుతున్నాడు. అప్పటికే వేసుకున్న ప్లాన్ ప్రకారం బీమనాథం దిలీప్‌రెడ్డి మోటారు బైకును అడ్డగించి అనంతరెడ్డిపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు. దాడిలో అనంతరెడ్డి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ హత్యను జె.పంగులూరు పోలీస్‌స్టేషన్‌లో అప్పటి ఎస్సై కె.అజయ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అప్పట్లో ఇంకొల్లు సీఐగా ఉన్న మద్దినేని శేషగిరిరావు దర్యాప్తు చేశారు. అనంతరం చార్జిషీటు దాఖలు చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేవీ రమేశ్వర్‌రెడ్డి ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు. పోలీసులు సకాలంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి విచారణను సమర్ధవంతంగా నడిపించారు. సాక్ష్యాధారాలతో నేరం రుజువు కావడంతో గురువారం మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఏ.పూర్ణిమ నిందితులకు జీవితఖైదుతో పాటుగా ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా విధించారు. హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్, కోర్టు లైజన్ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి ఎస్పీ హర్షవర్థన్ రాజు అభినందనలు తెలిపారు.
మొదటి భార్య వద్దకు ఎందుకెళ్తున్నావని గొడవ


