బీచ్ ఫెస్టివల్ జయప్రదం చేయండి
● కలెక్టర్ పి.రాజాబాబు
సింగరాయకొండ: పాకల బీచ్‌లో ఈ నెల 14,15 తేదీల్లో జరిగే బీచ్ ఫెస్టివల్ జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ బి.రాజాబాబు అన్నారు. బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన పనులపై గురువారం సాయంత్రం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమంలో ప్రముఖంగా ఎగ్జిబిషన్, స్టేజ్‌షోలు, సింగర్స్, సెలబ్రిటీల హంగామా, వాటర్ గేమ్స్, హెలీ టూరిజం, వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఫెస్టివల్‌లో 30 వేల మంది పాల్గొంటారని భావిస్తున్నామని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తామన్నారు. బీచ్ ఫెస్టివల్‌కు బస్సులు, కార్లు, మోటార్‌సైకిల్‌పై వచ్చే వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ వసతి కల్పిస్తామన్నారు. తరువాత అధికారులతో సమీక్ష నిర్వహించి సింగరాయకొండ– పాకల, పాకల– ఊళ్లపాలెం మధ్య రోడ్డు గుంతలు పూడ్చాలని సంబంధిత శాఖల నుంచి నిధులు సమీకరించుకోవాలని సూచించారు. ఫెస్టివల్‌ను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సహాయ సహకారాలు అందించాలన్నారు. తరువాత పాకల పల్లెపాలెంలో అక్షరాంధ్ర కేంద్రాన్ని సందర్శించి మహిళలతో మాట్లాడారు. డీఆర్‌ఓ ఓబులేసు, ఆర్‌డీఓ లక్ష్మీ ప్రసన్న, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రాజేష్, సీఐ సీహెచ్ హజరత్తయ్య, ఎస్సై బి.మహేంద్ర, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


