‘పొట్ట’ కొట్టకే పిట్టా!
ఆరుగాలం శ్రమించి పండించిన వరి పైరును కళ్ల ముందే పిట్టలు నాశనం చేస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపట్నంతోపాటు పరిసర ప్రాంతాల్లో పంట చేతికొచ్చే సమయంలో వేలాది పిట్టలు వరి కంకులపై వాలి గింజలు తొలిచేస్తుండటంతో విలవిల్లాడుతున్నారు. పక్షులను బెదరగొట్టేందుకు పొలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపలా కాస్తున్నా మరో దిక్కున పంటపై వాలి నాశనం చేస్తున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. కొందరు రైతులు చేసేదేమీ లేక పంటను వదిలేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని, పిట్టలను తోలేందుకు కూలీలను నియమించినా ప్రయోజనం కానరావడం లేదని రైతులు అశక్తత వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పక్షుల బెడద నుంచి పంటను రక్షించుకునే మార్గాలు సూచించాలని కోరుతున్నారు.
– కొత్తపట్నం


