ఘాట్‌రోడ్డులో నిలిచిన లారీ
● 3 గంటల పాటు స్తంభించిన ట్రాఫిక్
● నట్టడివిలో చలిగాలులతో ప్రయాణికుల అవస్థలు
పెద్దదోర్నాల: సాంకేతిక కారణాలతో ఓ ఇసుక లారీ నడిరోడ్డుపై నిలిచిపోవడంతో మూడు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సంఘటన శ్రీశైలం ఘాట్‌లోని చింతల, తుమ్మబైలు గిరిజన గూడేల నడుమ ఆదివారం జరిగింది. దీంతో శ్రీశైలం ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు పూర్తి స్థాయిలో ఇబ్బందులు తలెత్తడంతో సంఘటనా స్థలానికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రం వైపు నుంచి శ్రీశైలంకు ఇసుక లోడుతో వెళ్తున్న లారీ మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చింతల, తుమ్మలబైలు మధ్య సాంకేతిక కారణాలతో నడిరోడ్డులో నిలిచిపోయింది. దీంతో రోడ్డుకి ఇరువైపులా ఆర్టీసీబస్సులు, టూరిస్ట్ బస్సులు, టారీలు ట్రిప్పర్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో కొందరు ఆర్టీసీ, లారీల సిబ్బంది రోడ్డుకడ్డంగా ఉన్న లారీని తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కొందరు మెకానిక్‌లతో రోడ్డుకు అడ్డంగా నిలిచిన లారీకి మరమ్మతులు చేశారు. 3 గంటల తర్వాత లారీని రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
చలి తీవ్రతతో ప్రయాణికుల అవస్థలు
నట్టడివిలో మూడు గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8 గంటల సమయంలో చలిగాలులు అధికంగా వీస్తున్నాయి. దీంతో ప్రయాణికుల కష్టాలు చెప్పేవీ కావు. స్థానిక పోలీసులు ముందస్తు జాగ్రత్తగా శ్రీశైలం వెళ్లే వాహనాలను మండల కేంద్రంలోని గణపతి చెక్‌పోస్టు వద్ద నిలిపివేసి ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత వాహనాలను శ్రీశైలానికి అనుమతించారు.
త్రిపురాంతకం: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నేషనల్ హైవేపై జరిగింది. వివరాల్లోకి వెళితే..త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి సమీపంలో రాంబాబు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై మరో వ్యక్తిని ఎక్కించుకుంటుండగా వినుకొండ వైపు వెళుతున్న వాహనం ఢీకొని వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వరి నాట్లు వేసుకునేందుకు తెల్లవారుజామున బయలుదేరి వెళుతూ ప్రమాదానికి గురవడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఎస్సై శివ బసవరాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఘాట్‌రోడ్డులో నిలిచిన లారీ


