వందేళ్ల సంబురం..!
ఘనంగా పీవీఆర్ హైస్కూల్ శతజయంతి ఉత్సవాలు
ఒంగోలు సిటీ:
ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ శత జయంతి ఉత్సవాలు పండుగలా సాగాయి. రెండు రోజుల పాటు నిర్వహించిన వేడుకల్లో దేశ నలుమూలల నుంచి వేలాది మంది పాఠశాల పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. 20 ఏళ్ల నుంచి యువత మొదలుకొని 80 ఏళ్ల వృద్ధుల వరకు వయసు, హోదాలు, పదవులు పక్కనపెట్టి శతజయంతి ఉత్సవాల్లో ఆడుతూ పాడుతూ, గంతులు వేస్తూ కేరింతలు కొట్టారు. చిన్నానాటి జ్ఞాపకాలను, ఆనాటి మధుర స్మృతులను తలుచుకుంటూ మనసారా నవ్వుకున్నారు. ఎక్కడో పుట్టి, ఇక్కడ కలిసి, ఎక్కడో పెరిగి ఐదారు దశాబ్దాల అనంతరం మళ్లీ కలిసి అరుదైన జ్ఞాపకాలు నెమరేసుకుని బరువెక్కిన గుండెలతో తిరిగి వెళుతున్నామంటూ పలువురు చేసిన వ్యాఖ్యలు గుండెను బరువెక్కించాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పూర్వ విద్యార్థులు, వారి కుటుంబసభ్యులతో నగరం మొత్తం కళకళలాడింది. సుమారు 2 వేలకు మందిగా పైగా పూర్వవిద్యార్థులు, అతిథులు పాల్గొనడంతో పీవీఆర్ స్కూల్ గ్రౌండ్స్ ఉత్సవ వేదికగా మారింది. వేడుకల్లో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదన్నారు. పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకొస్తే గ్రామీణ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. పలువురు వక్తలు మాట్లాడుతూ పీవీఆర్ హైస్కూల్‌లో చదువుతున్న వారిలో ఎంతో మంది గొప్ప స్థాయిలో ఉన్నారన్నారు. దశాబ్దాల కాలం తర్వాత అందరూ ఒకేసారి కలుసుకునేలా వందేళ్ల ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రిటైర్డు డీజీపీ నండూరి సాంబశివరావు, ప్రముఖ వైద్యులు (యూఎస్‌ఏ) రంగరాజన్ వంటి ప్రముఖులు ఎందరో పీవీఆర్ నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నామని తమ అనుభవాలను నెమరువేసుకున్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలు ఆదివారం నాడు చేపట్టిన పలు కార్యక్రమాలతో విద్యాభివృద్ధి సామాజిక బాధ్యతగా నూతన సంకల్పానికి వేదికగా నిలిచింది.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నళినిప్రియ డ్యాన్స్ అకాడమీ వారి నాట్యాలు, చందు డ్యాన్స్ అకాడమీ వారి నృత్యం, పీవీఆర్ 76–77 బ్యాచ్ విద్యార్థులు రూపొందించిన పీవీఆర్ చరిత్ర వంటి సాంస్కతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. పూర్వ విద్యార్థుల పరిచయాలు, ఉన్నత స్థాయికి ఎదిగిన వారికి ఆత్మీయ సత్కారాలు వేడుకలకు మరింత వన్నె తెచ్చాయి. వేడుకల సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ఫైలాన్‌ను బాలికల పాఠశాల వద్ద మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదీర్ఘకాలం హెడ్ మాస్టర్‌గా పనిచేసిన కొప్పోలు హనుమంతరావును గురప్రుబగ్గీపై పాత పీవీఆర్ స్కూల్ నుంచి బాలుర స్కూల్ వరకు ఊరేగింపుతో ఆహ్వానం పలికారు. శతాబ్ది ఉత్సవ కమిటీ కార్యదర్శి ఆరిగ వీరప్రతాప్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బోడపాటి వెంకట సుబ్బారావు, దేనువుకొండ సుబ్బయ్య, మాంటిస్సోరి ప్రకాష్‌లను పలువురు అభినందించారు. ఉత్సవాల్లో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, నగర కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, మంత్రి శ్రీనివాసరావు, బత్తిన మదన్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది హాజరు
విద్యార్థుల ఆత్మీయ కలయికతో పులకించిన పాఠశాల ప్రాంగణం
వందేళ్ల సంబురం..!
వందేళ్ల సంబురం..!
వందేళ్ల సంబురం..!


