పథకం ప్రకారమే హత్య
గిద్దలూరురూరల్(బేస్తవారిపేట): మండలంలోని దంతరేపల్లిలో భార్య, కూతురు కలిసి పథకం ప్రకారమే హత్య చేసినట్లు గిద్దలూరు సీఐ కె.సురేష్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన సారమేకల హరికి.. లక్ష్మీదేవితో 33 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే భార్యతో వచ్చిన విభేదాలతో 15 ఏళ్లుగా లక్ష్మిదేవి వేరువేరుగా ఉంటున్నారు. అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి ఇల్లు, పొలాలు చూసుకుని భార్య లక్ష్మీదేవితో గొడవపడి వెళ్తుండేవాడు. దీంతో భర్తను చంపాలని నిర్ణయించుకొని సమయం కోసం ఎదురుచూసింది. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన హరి గ్రామానికి వచ్చాడు. 5వ తేదీన భార్య, కుమార్తెతో గొడవ పడ్డారు. దీంతో వారిద్దరూ పథకం ప్రకారం ముఖంపై కారం చల్లి ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు. సంజీవరాయునిపేట వీఆర్వో ఇచ్చిన రిపోర్టు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఆదివారం నిందితులు ఇద్దరిని దంతరేపల్లిలో అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
ఒంగోలు టౌన్: ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం...మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గ్రామానికి చెందిన నైనాల శ్రీనివాసరావు (28) జామకాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. శనివారం జామకాయలు అమ్మకం ముగించుకొని ఇంటికి తిరుగుప్రయాణమయ్యాడు. త్రోవగుంట సమీపంలోకి రాగానే ఆటో బోల్తా పడింది. నైనాల శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 8 గంటలకు మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఇనమనమెల్లూరులో విషాదం నెలకొంది. మృతుడి భార్య పిల్లలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
ఒంగోలు సిటీ: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఒంగోలు మండలంలో కరవదిలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రస్థాయి మహిళా బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతి రూ.40 వేలు, రెండో బహుమతి రూ.30 వేలు, మూడో బహుమతి రూ.25 వేలు, నాల్గవ బహుమతి రూ.20 వేలు, ఐదో బహుమతి రూ.15 వేలు, ఆరో బహుమతి రూ.10 వేలు అందజేస్తామన్నారు. పూర్తి వివరాలకు 8978095030 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


