నాయకుల అండతో రాష్ట్రంలో డ్రగ్స్ సామ్రాజ్యం
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో రాజకీయ నాయకుల అండదండలతో డ్రగ్స్ వ్యాపారం సామ్రాజ్యం విస్తరించిందని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. డ్రగ్స్‌ను అరికట్టాలి, యువత భవిష్యత్‌ను కాపాడాలి అనే అంశంపై ప్రజా సంఘాల కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర వస్తువులైనా దొరకవేమో కానీ అన్ని వేళలా డ్రగ్స్ మాత్రం అన్నీ చోట్లా అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఒకప్పుడు చాటుమాటు వ్యవహారంలా సాగే డ్రగ్స్ దందా నేడు నడిబజారుకెక్కిందన్నారు. చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో అడ్డూ అదుపు లేకుండా విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అనధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లో గంజాయి సాగులో ఉందన్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఏడాదికి రూ.25 వేల కోట్ల మత్తు పదార్థాల వ్యాపారం జరుగుతోందని కొందరు అధికారులు చెబుతున్నారని తెలిపారు. గంజాయి మాఫియాకు పాలక పార్టీల అండదండలే కారణమని మండిపడ్డారు. గంజాయి నిర్మూలన కోసం పనిచేస్తూ హత్యకు గురైన పెంచలయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆంద్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎం.విజయ మాట్లాడుతూ రోజూ గంజాయి ముఠాలను అరెస్టు చేస్తున్నా, క్వింటాళ్ల కొద్ది గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నా గంజాయి రవాణా ఆగడం లేదని , దీని వెనక ఉన్న శక్తులను అరెస్టు చేస్తేనే కానీ ఈ మహమ్మారి పీడ వదలదని స్పష్టం చేశారు. గంజాయి కట్టడికి హోంశాఖ తగినస్థాయిలో పనిచేయడం లేదని విమర్శించారు. డైఫీ ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య మాట్లాడుతూ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరాస్వామిలు మాట్లాడుతూ పాలక పార్టీల వల్లే డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోతుందన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారని తెలిపారు. కార్యక్రమంలో మహిళా న్యాయవాది ఎస్‌కే మోబినా, ఐద్వా నగర కార్యదర్శి ఆదిలక్ష్మి, నగర నాయకులు కె.రాజేశ్వరి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు జువ్వాజి రాజు, డైఫీ జిల్లా నాయకులు పి.కిరణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, జి.రమేష్, కె.యోబు, బి.రత్నం పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో ధ్వజమెత్తిన మహిళా నాయకులు


