బీసీ సామాజిక రక్షణ చట్టం చేయాలి
ఒంగోలు టౌన్: రజక వృత్తిదారుల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించేందుకు రక్షణ చట్టం చేయాలని, అపార్ట్‌మెంట్లలో పనిచేసేవారి మీద, వాచ్‌మెన్ల మీద జరిగే దాడులు, వేధింపులు, అక్రమ నిర్బంధాలను అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో చట్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య డిమాండ్ చేశారు. ఎల్బీజీ కార్యాలయంలో ఆదివారం రజక సంఘం జిల్లా సదస్సు నిర్వహించారు. సదస్సుకు రాచకొండ వెంకట కృష్ణయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భాస్కరయ్య మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీసీలందరికీ సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాదిన్నర గడస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. నామమాత్రంగా కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని, వెంటనే వివిధ వృత్తి సంఘాలు, ప్రజా సంఘాలతో చర్చించి విధివిధానాలు తయారు చేయాలని కోరారు. జీవో నంబర్ 27 ప్రకారం వివిధ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న ధోబీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కార్పొరేషన్ ద్వారా 90 శాతం సబ్సిడీతో వృత్తిలో ఉన్న రజకులకు రూ.5 లక్షల వరకు రుణాలు మంజూరు చేయాలని, కనీస వేతనం రూ.1800 ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర నాయకులు పొదిలి శ్రీనివాసులు, రాయల మాలకొండయ్య, ఎ.రమణమ్మ, ఎం.శ్రీనివాసులు, సీహెచ్.శ్రీనివాసులు, చీమకుర్తి కోటేశ్వరరావు, గుర్రపుశాల శ్రీను, అమరయ్య, యోగమ్మ, మల్లికార్జున పాల్గొన్నారు. సంఘ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.


