వ్యాపారులపై పెరిగిన దాడులు
పొట్టి శ్రీరాములు విగ్రహ ఏర్పాట్లకు గూండాలతో చందాలు వసూలు చేస్తున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వంలో వ్యాపారాలు జరగక తమ దుకాణాలను మూసివేసుకుంటున్నారని, దానికి తోడుగా వ్యాపారులు, వైశ్యులపై దాడులు ఎక్కువయ్యాయని రాష్ట్ర మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో ఆదివారం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పొదిలిలో పోలీసులు ఆర్యవైశ్య వ్యాపారులైన అవినాష్, యాదా కోటేశ్వరరావుపై ఏ విధంగా దాడులు చేశారో రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిందన్నారు. దాడి చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఊరంతా ఏకమై బంద్ నిర్వహిస్తే ఆయనను వీఆర్‌కు పంపి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం వచ్చింది, రేషన్ డీలర్‌గా రాజీనామా చేయాలని దర్శి మండలంలో ఆర్యవైశ్యుడైన సత్యనారాయణపై ఒత్తిడి తీసుకొచ్చారని, తాను దశాబ్దాల కాలంగా డీలర్‌గా కొనసాగుతున్నానని, రాజీనామా చేయనని కోర్టునుంచి స్టే తీసుకొస్తే అతనిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారన్నారు. సత్యనారాయణ భయంతో గుడిలో దాక్కుంటే అతనిపై తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జ్యోతి అనే ఆర్యవైశ్య మహిళ భర్త ఆర్ధిక ఇబ్బందులతో కనిపించకుండా పోవడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిందని, ఆమెను రాత్రి 7.30 నుంచి 12 గంటల వరకు పోలీస్ స్టేషన్‌లో ఏ విధంగా ఉంచారని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో ఒక ప్రేమోన్మాది యువతి తండ్రి ఒప్పుకోలేదని ఒక ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయన్ను దాడి చేసి చంపేశాడని, ఈ దాడులన్నీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగినవేనన్నారు. ఈ రోజు వైశ్యులు వ్యాపారాలు చేసేందుకు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి నాయకులు ఆర్యవైశ్య ఓట్లతో గెలిచారన్నారు. దాడులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు ఉగ్రరూపం చూపించాల్సి వస్తుందని, వారిని భయపెడితే రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేది ఆర్యవైశ్యులేనని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.
పొట్టి శ్రీరాములు విగ్రహ ఏర్పాటుకు చందాల వసూలు:
పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని రోడ్డుపై ఏర్పాటు చేస్తామని చెప్పి సిగ్గులేకుండా చందాలు వసూలు చేస్తున్నారని, ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం విగ్రహం పెట్టలేకుండా పోతోందని వెల్లంపల్లి విమర్శించారు. ఎన్టీఆర్ విగ్రహం కోసం రూ.1750 కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చుపెడుతున్నారని, అందుకు తమకేమీ అభ్యంతరం లేదని, పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు కేవలం రూ.50 కోట్లు ఖర్చుపెట్టలేక చందాలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పర్మిషన్ ఇచ్చేశాం, రాష్ట్రం అంతా వైశ్యుల వద్ద డబ్బులు దండుకొనిరమ్మని టీడీపీ గూండాలను పంపిస్తున్నారని ఆయన విమర్శించారు. రూ.3 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఒక విగ్రహానికి అయ్యే ఖర్చుపెట్టుకోవటానికి చంద్రబాబు ప్రభుత్వానికి చేతకాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయం గురించి ప్రశ్నిస్తే గతంలో మీరేం చేశారని టీడీపీ నుంచి కొంతమంది వైశ్యులు బయటికి వస్తున్నారని, గతంలో జగన్‌మోహన్‌రెడ్డి వైశ్యుల కోసం చేసిన సహాయం మీ చంద్రబాబు నాయుడు జీవితంలో చేయలేడని అన్నారు. ఈబీసీ నేస్తమని ప్రతి పేద ఆర్యవైశ్య కుటుంబాన్ని ఆదుకుంది జగన్‌మోహన్‌రెడ్డి అని, జగనన్న కాలనీల్లో స్థలాలు మంజూరు చేశారని, మీరేమైనా వారి కోసం ఒక్క పథకం అమలు చేశారా అని ప్రశ్నించారు. ఆర్యవైశ్యులకు చెందిన ఒకాయన మంత్రి ఉన్నాడని, కొంతమంది నాయకులు ఉన్నారని, ఘోరంగా తమ సామాజికవర్గంపై దాడులు చేస్తుంటే నోరుమూసుకొని చంద్రబాబుకు తొత్తులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.


