
పాత్రికేయులు వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి
● ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేష్‌కుమార్
మార్కాపురం టౌన్: పాత్రికేయులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఏపీసీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్‌కుమార్ సూచించారు. శనివారం మార్కాపురంలోని సౌజన్య కల్యాణ మండపంలో అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సురేష్‌కుమార్ మాట్లాడుతూ పాత్రికేయ వృత్తిలో స్థాయి పెంచాలనే లక్ష్యంతో అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జర్నలిజంలో నైతిక విలువలు పాటించాలని, వాస్తవాలను ప్రచురించాలని సూచించారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ పోలీసులు, పాత్రికేయుల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, సమాజంలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకుని వార్తలు ఇవ్వాలని కోరారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కార్యదర్శి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, కార్యదర్శి సురేష్, జిల్లా అధ్యక్షుడు ఎన్‌వీ రమణ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు వెంకట్రావు, జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, ఒంగోలుకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు.