
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి
ఒంగోలు సబర్బన్: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు చిన్నపురెడ్డి కిరణ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒంగోలు నగరంలోని బందరు రోడ్డులోని శారదా బాల కుటీర్ వార్డు సచివాలయంలో ఏపీజీఈఏ శనివారం రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేకంగా గత ప్రభుత్వం వార్డు, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిందన్నారు. సచివాలయాల ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతినకుండా యూనియన్ పోరాటం చేస్తుందని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్‌సీని ప్రభుత్వం ప్రకటించాలన్నారు. ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ నగదు రూపంలో రావాల్సి ఉందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన డీఏలు ప్రభుత్వం బకాయి ఉందన్నారు. ఇవన్నీ ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదని, తరువాత ఏవిధమైన కార్యాచరణ చేపడదామన్న అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఏపీజీఈఏ ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తారన్నారు. ఏపీజీఈఏ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రతి విభాగంలో అందరితో చర్చించిన మీదట ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో నిర్ణయం తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి వరకుమార్, కోశాధికారి రంగారెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రజిత మానస, సంఘ నాయకులు జల్లా చంద్రశేఖర్, కొనికి శ్రీనివాసులు, నివేదిత అలెక్స్, సుజాతలతోపాటు సచివాలయ ఉద్యోగులు ప్రభాకర్, గోపి, వినయ్, వెంకటేష్, సురేష్, స్వాతి, అబ్బయ్య, అర్చన, మీనా, తిరుపతయ్య, వినయ్, సరితతో పాటు తదితరులు పాల్గొన్నారు.