
కార్పొరేట్లకు పంట భూములు
ఒంగోలు టౌన్: పంట భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని ప్రజలు వ్యతిరేకించాలని సీపీఐ ఎంఎల్ రెడ్‌స్టార్ కేంద్ర కార్యదర్శి పీజే జేమ్స్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సీపీఐ ఎంఎల్ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సామాన్య ప్రజలకు చెందిన భూములను కార్పొరేట్లకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో మూడు పంటలు పండే పొలాలను స్వాధీనం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరేడు భూములను సోలార్ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాలు విరమించుకోవాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భూములను లులూ వంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే విధానాలకు స్వస్తి పలకాలన్నారు. అమరావతి రైతాంగానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరో 50 వేల ఎకరాల భూములు సేకరించాలనే ప్రయత్నాలు మంచిది కాదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భవించి 100 ఏళ్లయిన సందర్భంగా సెప్టెంబర్ 27న జంగారెడ్డిగూడెంలో రాష్ట్ర స్థాయిలో ఫాసిస్టు వ్యతిరేక సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న గంజాయి వంటి మత్తు పదార్థాలను అరికట్టాలని, ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తున్న కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశానికి మన్నవ హరిప్రసాద్ అధ్యక్షత వహించగా రంగనాథం, కొల్లిపర వెంకటేశ్వరరావు, భీమవరపు సుబ్బారావు, వెనిగళ్ల పుష్పలత పాల్గొన్నారు.
అక్రమంగా అప్పగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
సీపీఐ ఎంఎల్ రెడ్‌స్టార్ కేంద్ర కార్యదర్శి పీజే జేమ్స్