
పడిలేవాల్సిందే..!
పది కిలోమీటర్లు
పొన్నలూరు:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనితీరు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. ఏడాదికిపైగా పాలనలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలేవీ అమలు చేయకపోగా, అభివృద్ధి పనులను కూడా సక్రమంగా అమలు చేస్తున్న దాఖలాలు లేవు. కనీసం ప్రధాన రహదారుల అభివృద్ధి పనులను కూడా గాలికొదిలేశారు. వాస్తవంగా రహదారుల అభివృద్ధే తమ ధ్యేయమంటూ.. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు అనేక సభలు, సమావేశాల్లో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా నేటికీ ఆ దిశగా చర్యలు తీసుకున్న పాపానపోలేదు. కొత్త రోడ్ల నిర్మాణం దేవుడెరుగు.. కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టి వాహనదారుల కష్టాలు తొలగించడంలేదు. కందుకూరు నుంచి పొన్నలూరు మీదుగా కనిగిరి వెళ్లే ఓవీ రహదారి దుస్థితే ఇందుకు నిదర్శనంగా ఉంది. ఈ రోడ్డు ప్రసుత్తం మరీ అధ్వానంగా తయారైంది. ఈ రహదారిపై ప్రయాణమంటే వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.
కొన్నేళ్ల క్రితం కందుకూరు నుంచి పొన్నలూరు మండల పరిధిలోని ముత్తరాసుపాలెం వరకు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించారు. ఈ రోడ్డును తూతూమంత్రంగా నాణ్యత లేకుండా నిర్మించడంతో కొన్నేళ్లకే అడుగడుగునా గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. ముఖ్యంగా రోడ్డు మధ్యలో తారు, కంకర లేచిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు వర్షం పడినప్పుడు, రాత్రి సమయాల్లో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. వేగంగా వచ్చే భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాలకు గుంతల్లో పడిలేస్తూ అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. పది కిలోమీటర్ల పొడవున అడుగడుగునా బ్రేకులు వేయాల్సి వస్తుండటంతో కూటమి ప్రభుత్వ తీరుపై ప్రయాణికులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దూబగుంట వద్ద కుంగిన చప్టా, రోడ్డు...
కందుకూరు నుంచి పొన్నలూరు మధ్యలో సుమారు 10 కిలోమీటర్ల దూరం ఓవీ రోడ్డు ఉంటుంది. ప్రధాన రహదారి కావడంతో ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అయితే, 11 ఏళ్ల క్రితం సింగిల్‌గా ఉన్న రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించే క్రమంలో దూబగుంట పొగాకు బోర్డు సమీపంలో ఉన్న పాత చప్టా స్థానంలో కొత్తది నిర్మించకుండా దానిపైనే డబుల్ రోడ్డు పనులు చేపట్టారు. దీంతో ఇటీవల ఈ చప్టా కుంగి రోడ్డు మధ్యలో రెండు చోట్ల మూడడుగుల వెడల్పుతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అయితే, ఈ ప్రాంతంలో సంబంధిత అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వేగంగా వచ్చిన వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. కొందరు వాహనదారులు చొరవ తీసుకుని కుంగిన చప్టా దగ్గర కర్రకు తెల్లని సంచి కట్టి ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేశారు. ఓవీ రహదారి ఇంత దారుణంగా ఉండి ప్రజలు చస్తున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులు చలించడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని పాలకులు, అధికారులు...
ఓవీ రహదారి కందుకూరు, కొండపి, కనిగిరి నియోజకవర్గాల పరిధిలో ఉండటంతో ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలతో పాటు లారీలు, టిప్పర్లు వంటి భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే, గత పది నెలలుగా ఓవీ రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి సైడ్ మార్జిన్లు అధ్వానంగా ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు చూస్తూ ఈ రహదారిపైనే వెళ్తున్నారు తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి ఓవీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
అధ్వానంగా కందుకూరు–పొన్నలూరు ఓవీ రోడ్డు
పది కిలోమీటర్ల పొడవున పెద్ద పెద్ద గుంతలు
అక్కడక్కడా రూపమే కోల్పోయిన రహదారి
దూబగుంట పొగాకు బోర్డు సమీపంలో కుంగిన చప్టా, రోడ్డు
చోద్యం చూడటం తప్ప పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
తరచూ ప్రమాదాలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు
కూటమి ప్రభుత్వంలో రహదారుల దుస్థితిపై అసహనం
రూపం కోల్పోయిన రహదారి...
ఇదిలా ఉంటే ముత్తరాసుపాలెం సమీపంలో మూడు చోట్ల రోడ్డు పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడి రూపమే కోల్పోయింది. దీంతో రోడ్డు సరిగా లేకపోవడంతో తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూ ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇటీవల ఒకేరోజు ముగ్గురు ద్విచక్ర వాహనదారులు ముత్తరాసుపాలెం సమీపంలో ఓవీ రోడ్డుపై గుంతలున్న సంగతి తెలియక వేగంగా వచ్చి ప్రమాదానికి గురయ్యారు. అలాగే ఎదురుగా వాహనం రావడంతో సైడ్ దిగిన కూలీల ఆటో రోడ్డు మార్జిన్ సరిగా లేకపోవడంతో అదుపుతప్పి పడిపోయింది. ఇలా తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.