
రాజకీయ ప్రత్యామ్నాయం రూపొందించుకోవాలి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ● ఒంగోలులో ఘనంగా సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో మతోన్మాద అరాచక పాలనకు ప్రత్యామ్నాయంగా వామపక్ష పార్టీలు రాజకీయ ప్రత్యామ్నాయం రూపొందించుకోవాలని, ఆ దిశగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు అన్నారు. వామపక్ష ఉద్యమాల బలోపేతానికి తాము కృషి చేస్తామన్నారు. ఒంగోలులో సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు ఎస్‌జీవీఎస్ కళ్యాణ మండపం ఆవరణలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు బలపడితేనే మతోన్మాదాన్ని ఎదిరించగలమని, ఆ దిశగా కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభల్లో కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన సూచించారు. ఓట్లు చేర్పుల విషయంలో బీహార్‌లో ఎస్‌ఐఆర్ అమలు చేస్తూ అత్యంత కుట్రపూరితంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తోందన్నారు. మరోవైపు వామపక్ష పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 30 రోజుల జైలు జీవితం ఉంటే ఉద్వాసన పలకాలన్న చట్టాన్ని ప్రతిపాదించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో మతోన్మాదం ఎప్పుడూ లేనంతగా పెరిగిందని, మోదీ భజనలు చంద్రబాబు ఎత్తుకుని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించడానికి పుట్టిందన్న జనసేన, 32 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాదించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదపకపోవటం దారుణమన్నారు. పరిశ్రమలు, రాజధాని అభివృద్ధి పేరుతో లక్షలాది ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్‌గా అభివృద్ధి చేస్తున్నారని, ఆ భూములు తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్న కార్పొరేట్ శక్తుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు దోహదపడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. 28వ రాష్ట్ర మహాసభలకు సూచనగా వేదిక నల్లూరి అంజయ్య ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర రావు మృతవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. పార్టీ జాతీయ నాయకులు రావుల వెంకయ్య ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. రాష్ట్ర నాయకుడు పీ జగదీష్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మహాసభలకు రాష్ట్ర నాయకులు జీవీ సత్యనారాయణమూర్తి, దుర్గా భవాని, నాజర్, జీఎంఎఎల్ నారాయణ అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన సభలో సీపీఐ జాతీయ కమిటీ నాయకురాలు వహీదా పర్వీన్, సీపీఐ జాతీయ కమిటీ నాయకుడు రావుల వెంకయ్య, సినీ నటుడు మాదాల రవి, జీ ఈశ్వరయ్య, రావుల రవీంద్రనాథ్, నల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు.