
పూరి ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు
సింగరాయకొండ: పూరి–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారు నాలుగు కేజీల గంజాయి పట్టుకుని ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన సింగరాయకొండ రైల్వేస్టేషన్ వద్ద శనివారం సాయంత్రం జరిగింది. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో ఒంగోలు–సింగరాయకొండ రైల్వేస్టేషన్ల మధ్య ఒంగోలు మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృంద సభ్యులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేసి నాలుగు కేజీల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని స్థానిక రైల్వేస్టేషన్‌లో దిగారు. అక్కడి నుంచి గంజాయితో పాటు నిందితులను పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు తరలించారు. వారిని విచారించిన తర్వాత జీఆర్పీ పోలీసులకు అప్పగించనున్నట్లు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. వారిలో చిత్తూరు జిల్లా యడమారి మండలం బోడగుట్టపల్లె పోస్ట్, కుప్పూరు గ్రామానికి చెందిన కేపీ వీరప్పన్ ఒరిశా నుంచి చిత్తూరు వెళ్తున్నాడు. అతని బ్యాగ్‌ను తనిఖీ చేయగా గంజాయి దొరికింది. మిగతా ఇద్దరి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘటనపై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తనిఖీల్లో ఎస్సైలు శ్రీకాంత్, చెంచయ్య, సుమారు 15 మందికిపైగా జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ టీం సభ్యులు పాల్గొన్నారు.
నాలుగు కేజీల గంజాయి పట్టివేత
ముగ్గురు అరెస్టు