
భార్యను కడతేర్చిన భర్త
బేస్తవారిపేట: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమె గొంతుకోసి హత్య చేసిన సంఘటన బేస్తవారిపేట మండలంలోని గలిజేరుగుళ్ల సమీపంలో ఉన్న పొలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పీవీపురం గ్రామానికి చెందిన భార్య, భర్తలు పగ్గాల వెంకటేశ్వర్లు, రామలక్ష్మమ్మ(40) తాము సాగుచేసుకుంటున్న మొక్కజొన్న పొలం వద్దకు ఉదయం వెళ్లారు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో.. పొలంలో వేప చెట్టు వద్ద భార్య గొంతు కోసి చంపేశాడు. ఈ విషయం సాయంత్రం 5 గంటల సమయంలో తమ్ముడికి ఫోన్ చేసి ‘నీ వదినను చంపేశాను..దహనం చేసుకుంటారో, ఏం చేసుకుంటారో చేసుకోండని’’ చెప్పాడు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో హత్య చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వెంకటేశ్వర్లు ఫోన్ స్విచాఫ్ చేసుకుని పరారయ్యాడు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సీఐ మల్లిఖార్జున, ఎస్సై ఎస్‌వీ రవీంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతో గొంతు కోసి దారుణ హత్య