
పద్ధతి మారకుంటే ప్రభుత్వానికి సరెండర్
● వైద్య శాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
ఒంగోలు సబర్బన్: ‘పైనుంచి పట్టించుకునే వారు లేరు.. కింద స్థాయిలో పనిచేసే వారు లేరు అన్నట్లుగా ఉంది పరిస్థితి. మీ నిర్లక్ష్యం వల్ల జిల్లాకు చెడ్డ పేరు వస్తోంది. సిగ్గుగా లేదా..?. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించకుండా ఏం చేస్తున్నారు?. పద్ధతి మార్చుకోకుంటే ప్రభుత్వానికి సరెండర్ చేస్తా’అని వైద్య శాఖ ఉన్నతాధికారులను కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఘాటుగా హెచ్చరించారు. వైద్యశాఖలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆమె సమావేశం నిర్వహించారు. డెలివరీలు, సీజనల్ వ్యాధులు, జ్వరాల కేసుల నమోదు తదితర వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. వైరల్ జ్వరాల బాధితులను గుర్తించడంలో క్షేత్రస్థాయిలో ఆశాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ‘మీ పరిధిలో ఆసుపత్రులపై దృష్టి సారిస్తున్నారా లేదా..?. హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీలను నియమించరా? కనీసం సమీక్షకు వచ్చేటప్పుడు నివేదికలు సమగ్రంగా తయారు చేసుకుని రారా?’ అంటూ డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస నాయక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మార్కాపురం జీజీహెచ్‌ను గత నెలలో మంత్రితో కలిసి తనిఖీ చేసినప్పుడు చర్చకు వచ్చిన సమస్యల పరిష్కారానికి మీరేమి చర్యలు తీసుకున్నారు? నాకు రిపోర్టు ఎందుకు పంపించలేదు?’ అంటూ సూపరింటెండెంట్ రామచంద్రరావును కలెక్టర్ ప్రశ్నించారు. కీలకమైన శాఖలోని ఉన్నతాధికారుల్లో ఇంత నిర్లక్ష్య ధోరణి ఏమిటని మండిపడ్డారు.