
గుండ్లకమ్మ పరవళ్లు
రాచర్ల: మండలంలో నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గుండ్లకమ్మవాగు పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. చోళ్లవీడు గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అకవీడు, చోళ్లవీడు, చినగానిపల్లె పంచాయతీల్లోని తురకవాని చెరువు, దొడ్డేనిచెరువు, ఉప్పలేటిచెరువు, ఎర్రగుడిదిన్నె చెరువు, రంగయ్యనాయుడు చెరువులకు గుండ్లకమ్మ వరద నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగి వ్యవసాయ బోరుబావులకు నీరు వస్తున్నాయని ఆయా గ్రామాల రైతులు వివరించారు. ఆకవీడులోని తురకవాని చెరువు అలుగు పారుతుండటంతో పంటకాలువలు మరమ్మతులకు గురై గ్రామం నుంచి మోకాలి లోతులో నీరు ప్రవహిస్తున్నాయి. రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో వచ్చేపోయే వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగులో ముమ్మరంగా చేపల వేట కొనసాగిస్తున్నారు.