
కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలి
ఒంగోలు సబర్బన్: నీటి కాలువల్లో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనుల్లో నాణ్యత ముఖ్యమని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులతో బుధవారం క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ నీటి కాలువల్లో జరుగుతున్న ఈ పనుల్లో పురోగతిపై ఆమె సమీక్షించారు. నాగార్జునసాగర్, రామతీర్థం, మోపాడు, కంభం చెరువుల నుంచి నీళ్లు సరఫరా అయ్యే కాలువల్లో చేపట్టిన పనుల పురోగతిని ఇరిగేషన్ ఎస్‌ఈ వరలక్ష్మి కలెక్టర్‌కు వివరించారు. ఎస్‌డీఎంఎఫ్ పనులను టెండర్ల ద్వారా చేపట్టామన్నారు. రూ.10 లక్షల లోపు విలువైన పనులైతే ఆయా సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయడంతో పాటు నాణ్యత కూడా అత్యంత కీలకమని కలెక్టర్ అన్నారు. ఈ దిశగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి చెరువులను కూడా పూర్తిస్థాయిలో నింపాలన్నారు. భూగర్భ నీటిమట్టం పెంచేందుకు ఆయా ప్రాంతాలను బట్టి నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలను కూడా రూపొందించాలని చెప్పారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఈలు, భూగర్భ నీటివనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.