
వనరులను సమర్థంగా వినియోగించుకోండి
మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్షలో కలెక్టర్
ఒంగోలు సబర్బన్: అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై మున్సిపాలిటీలు దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఒంగోలుతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల వారీగా కార్యాలయంలో ఉన్న పారిశుధ్య కార్మికుల వివరాలు, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ, డ్రైనేజీలను శుభ్రం చేయటం, తాగునీటి సరఫరాపై ప్రధానంగా ఆమె సమీక్షించారు. పారిశుధ్య నిర్వహణపై ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తున్నందున పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఆయా విషయాల్లో ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనరు కె. వెంకటేశ్వరరావును కలెక్టర్ ఆదేశించారు. డ్రైనేజీలను శుభ్రం చేయటానికి నగరంలో 15 రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. అన్న క్యాంటీన్లలో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు కీలకమని కమిషనర్లకు చెప్పారు. వీధి కుక్కలను కట్టడి చేయటం, వాటికి వ్యాక్సిన్ వేయించడం పైనా దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు చెప్పారు. జంతు ప్రేమికుల సహకారం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మునిసిపల్ కమిషనర్లతో పాటు పబ్లిక్ హెల్త్ అధికారులు కూడా పాల్గొన్నారు.
కోతలు లేకుండా విద్యుత్ అందించాలి
ఒంగోలు సబర్బన్: కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేపట్టాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల పట్ల సిబ్బంది ప్రవర్తన బాగుండాలని, సంస్థకు చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లును ఆదేశించారు. వ్యవసాయ, పరిశ్రమలకు విద్యుత్ డిమాండు–సరఫరా, పీఎం సూర్యఘర్, ఆర్.డి.ఎస్.ఎస్ పనులు, స్మార్ట్ మీటర్లు, నూతన సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల్లో పురోగతి, సిబ్బంది– ఖాళీలు, గ్రీవెన్స్ అర్జీల పరిష్కారం, ఐవీఆర్‌ఎస్ సర్వేలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్, తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. ఆయా అంశాలపై ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు కలెక్టరుకు వివరించారు. ఖాళీగా ఉన్న ఏఈఈ పోస్టులను భర్తీ చేయటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పనిచేసే ప్రాంతంలోనే సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా ఐవీఆర్‌ఎస్ సర్వేలో విద్యుత్తుశాఖ సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా చూడాలన్నారు. దోర్నాల, మార్కాపురం, ముండ్లమూరు, చీమకుర్తి, పెద్దారవీడు, యర్రగొండపాలెం, సంతనూతలపాడు, పామూరు, మద్దిపాడు మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆర్‌డీఎస్‌ఎస్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు కొత్తగా వేస్తున్న 3–ఫేస్ విద్యుత్ లైన్ల పనులు కూడా వేగవంతం చేయాలని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో విద్యుత్ శాఖ ఈఈలు, డీఈఈలు, నెడ్ క్యాప్ అధికారులు పాల్గొన్నారు.