
29 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వ నూతన బార్ పాలసీలో భాగంగా జిల్లాలో 29 బార్లకు లైసెన్స్‌లు మంజూరు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు తెలిపారు. స్థానిక ప్రకాశం భవనంలోని డీపీఈఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈఎస్ షేక్ ఆయేషా బేగంతో కలిసి బార్ పాలసీ గురించి ఆయన వివరించారు. 29 బార్లలో గీత కార్మికులకు మూడు బార్లను కేటాయించినట్లు తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 16 బార్లు, మార్కాపురం పరిధిలో 5, చీమకుర్తి, పొదిలి, దర్శి, కనిగిరి, గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున బార్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చినట్లు వివరించారు. దరఖాస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో స్వీకరించనున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని చెప్పారు. ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. దరఖాస్తు ఫీజు 5 లక్షల రూపాయలు, ప్రాసెసింగ్ ఫీజు 10 వేల రూపాయలతో ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 28వ తేదీ అంబేడ్కర్ భవన్‌లో కలెక్టర్ సమక్షంలో డ్రా తీసి లైసెన్స్‌లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. నూతన పాలసీలో రెండు శ్లాబులుగా విభజించారని, ఒంగోలు, మార్కాపురం రూ.55 లక్షల శ్లాబు పరిధిలోకి వస్తాయని, మిగిలిన బార్లు రూ.35 లక్షల శ్లాబు పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఈ ఫీజులను ఆరు విడతలుగా చెల్లించవచ్చన్నారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం మాట్లాడుతూ నూతన బార్ల ఏర్పాటుకు హైబ్రిడ్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. గీత కార్మికులకు కేటాయించిన బార్లలో గౌడ కులస్తులు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఒకటి, మార్కాపురం పరిధిలో గౌడ, గాండ్ల కులస్తులకు చెరోకటి చొప్పున రెండు రిజర్వ్ చేసినట్లు చెప్పారు. గీత కార్మికుల బార్లకుగానూ ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. 30వ తేదీ లాటరీ ద్వారా లైసెన్సులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. గీత కార్మికులకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించినట్లు చెప్పారు. లైసెన్స్ కాలపరిమితి ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటి నుంచి 2028 ఆగస్టు వరకు ఉంటుందన్నారు. కొత్త వ్యాపారులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో ఏఈఎస్ ఎర్ర వెంకటేష్ పాల్గొన్నారు.
వాటిలో గీత కార్మికులకు మూడు కేటాయింపు