
క్రీడలతో ఆత్మవిశ్వాసం
ఒంగోలు టౌన్: క్రీడలు క్రమశిక్షణతో పాటు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఆదివారం స్థానిక మినీ స్టేడియంలో సిద్దార్థ కరాటే డు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 43వ అంతర్జాతీయ కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 700 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలను ప్రకాశం జిల్లాలో నిర్వహించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులకు శారీరక దృఢత్వంతో పాటుగా మానసిక స్థైర్యాన్ని కలిగిస్తాయని చెప్పారు. జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతాలు, విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన క్రీడాకారులతో పరస్పర అవగాహన కలిగించడమే కాకుండా స్నేహాన్ని పెంపొందిస్తాయన్నారు. క్రీడలతో చెడు అలవాట్లను దూరంగా పెట్టవచ్చని చెప్పారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలను చదవుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని సూచించారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, దేశానికి సేవ చేసే అవకాశం కూడా లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, కరాటే అసోసియేషన్ నాయకులు నల్లూరి మోహన్, విద్యా సంస్థల అధిపతి నల్లూరి వెంకటేశ్వర్లు, మండవ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.