
మూడు రకాల బస్సు సర్వీసులకే ఉచితం
జిల్లాలో పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులకు మాత్రమే ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుంది. అంటే దాదాపుగా దూర ప్రాంతాలకు ఉచితం లేనట్టేనని చెప్పవచ్చు. జిల్లా నుంచి నెల్లూరు జిల్లా కావలి, కందుకూరు, పల్నాడు జిల్లా వినుకొండ వరకు పల్లెవెలుగు బస్సులు నడుస్తున్నాయి. అయితే ఒంగోలు నుంచి గుంటూరు, విజయవాడకు ప్రయాణాలు చేసే వాళ్లే ఎక్కువగా ఉంటారు. వారికి ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నప్పటికీ అందులో నాన్ స్టాప్ బస్సులకు ఉచిత సౌకర్యం కల్పించడం లేదు కనుక టికెట్ కొనుక్కొని ప్రయాణించాల్సి ఉంటుంది.
ఆటోవాల ఉపాధి సంగతేంటి...
జిల్లాలో 20 వేల మందికి పైగా ఆటోవాలాలు ఉన్నారు. ఒక్క ఒంగోలు నగరంలోనే 5 వేల మంది ఆటోలపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇప్పడు ఉచిత బస్సు పథకం ప్రారంభం కానుండడంతో తమ ఉపాధి ఎక్కడ దెబ్బతింటుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆటోవాలాలకు ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వాహన మిత్ర ద్వారా ఏడాదికి రూ.25 వేల సహాయాన్ని అందించాలని కోరుతున్నారు. లేకపోతే తమకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే బీఎన్‌ఎస్ చట్టాన్ని సవరణ చేయాలని, మోటారు వాహన చట్టాన్ని సవరణ చేసి జరిమానాలను తగ్గించాలని కోరుతున్నారు. ఆటోవాల జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకపోతే పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.