
చిరుత నోట చిక్కి.. ప్రాణాలతో బయట పడిన మూడేళ్ల చిన్నారి
ప్రకాశం జిల్లా చిన్నారుట్ల గూడెంలో ఘటన
పెద్దదోర్నాల: చిరుత నోటికి చిక్కిన చిన్నారి.. గాయాలతో బయటపడిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. చిన్నారుట్ల గూడేనికి చెందిన కుడుముల అంజయ్య, లింగేశ్వరి తమ మూడేళ్ల కుమార్తె అంజమ్మతో కలిసి బుధవారం రాత్రి తమ ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో చిరుత వారి ఇంట్లోకి ప్రవేశించి.. అంజమ్మ తలను నోట కర్చుకొని అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలో చిన్నారి పెద్దగా ఏడవటంతో నిద్రలేచిన తల్లిదండ్రులు.. చిరుతను చూసి షాక్‌కు గురయ్యారు.
భయంతో గట్టిగా కేకలు వేయగా.. చిన్నారిని వదిలేసి చిరుత పారిపోయింది. గాయపడిన చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే శ్రీశైలం ప్రాజెక్టు వైద్యశాలకు తీసుకెళ్లి.. ప్రథమ చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు గురువారం ఉదయం చిన్నారుట్ల గూడేనికి చేరుకుని.. బాలికను పెద్దదోర్నాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాలిక మెడపై గాయాలు కావడంతో వైద్యులు కుట్లు వేశారు. బాలిక చికిత్స నిమిత్తం ఆమె తల్లిదండ్రులకు ఎస్సై మహేష్ ఆరి్థక సాయం చేశారు.
బాలికను డీఎఫ్‌వో సందీప్ కృపాకర్ పరామర్శించారు. క్షతగాత్రురాలికి మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తామని చెప్పారు. చిరుత కదలికలు కనిపెట్టేందుకు ఐదుగురు సిబ్బందిని నియమించడంతో పాటు 15 కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గూడెం వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, విద్యుత్ సదుపాయం లేకపోవడం వల్లే తరుచూ వన్యప్రాణులు దాడులు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీశైలం రహదారిపై గూడెం వాసులు నిరసన తెలిపారు. డీఎఫ్‌వో స్పందిస్తూ.. చిన్నారుట్ల గూడేనికి త్వరలో విద్యుత్ సౌకర్యం ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.