
మార్కాపురంలో ఇసుక మాఫియా
ఒంగోలు సబర్బన్: మార్కాపురంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని మార్కాపురం లారీ అసోసియేషన్ అధ్యక్షుడు కాశీరాం సింగ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు మార్కాపురం నుంచి వచ్చిన లారీ అసోసియేషన్ నాయకులు, సభ్యులు ప్రకాశం భవన్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాశీరాం సింగ్ మాట్లాడుతూ మార్కాపురంలో ఇసుక డిపో నుంచి అధిక ధరలకు ఇసుకను అమ్ముతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. మార్కాపురం ప్రజలను ఇసుక మాఫియా నుంచి కాపాడాలంటూ నినాదాలు చేశారు. అత్యధిక ధరలకు ఇసుకను విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ఒక్కో టన్నుకు రూ.400 కమీషన్ రూపంలో తీసుకుంటున్నారని, యార్డ్ నిర్వాహకుడు గొట్టిపాటి సూరి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి వైఖరి కూడా సరిగా లేదంటూ ధ్వజమెత్తారు. మైన్స్ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పటంతో ఒంగోలు వచ్చామని అయితే అధికారులు స్పందించలేదన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఉప్పలదిన్నె శ్రీనివాస రావు, బాలాజీ సింగ్, పఠాన్ ఖాన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
ప్రకాశం భవన్ ముందు లారీ అసోసియేషన్ ధర్నా మార్కాపురం ఎమ్మెల్యే పక్షపాతం చూపిస్తున్నారని ధ్వజం