
వార్డెన్ బదులు బినామీ వార్డెన్ విధులు
● బాలికల హాస్టల్‌ను తనిఖీ చేసిన డిప్యూటీ కలెక్టర్
చీమకుర్తి: హాస్టల్ విధులు నిర్వహించాల్సిన వార్డెన్ తన ప్లేస్‌లో బినామీ వార్డెన్‌ను పెట్టుకొని తన విధులకు తరచూ డుమ్మా కొడుతున్నట్లు డిప్యూటీ కలెక్టర్ పార్ధసారధి విచారణలో తేటతెల్లమైంది. మాదిగ సంక్షేమ పోరాట సమితి అధ్యక్షుడు కొమ్ము సుజన్ కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో డిప్యూటీ కలెక్టర్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి పార్ధసారధి బుధవారం చీమకుర్తిలోని ఎస్సీ బాలికల హాస్టల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఇటీవల హాస్టల్‌లో 9వ తరగతి చతువుతున్న బాలిక జడను పూర్తిగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించటంతో హాస్టల్‌లోని దయనీయ పరిస్థితులపై కొమ్ము సుజన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తనిఖీకి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ హాస్టల్‌లోని బాలికలను విడివిడిగా విచారించి హాస్టల్‌లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ ఎప్పుడో ఒకసారి వస్తుందని, ఆమె బదులు మరొక మహిళను బినామీగా పెట్టి హాస్టల్ బాధ్యతలను పర్యవేక్షించేలా చేసినట్లు గుర్తించారు. హాస్టల్‌లో మెనూ పాటించటం లేదని, పిల్లల కడుపు కాలుస్తున్నారని, తాగటానికి సురక్షితమైన మంచినీరు లేదని, 180 మంది పిల్లలకు ఒకటి రెండు బాత్‌రూములు మాత్రమే ఉన్నాయని, హాస్టల్‌లోని దయనీయ పరిస్థితుల వివరాలను డిప్యూటీ కలెక్టర్ విచారణలో స్పష్టమైంది. విచారణ అనంతరం మాదిగ సంక్షేమ పోరాట సమితి నాయకులు కొమ్ము సుజన్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు హాస్టల్‌లోని పరిస్దితులపై డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.