
బీ అలర్ట్..!
ఒంగోలు సబర్బన్: రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తన కార్యాలయం నుంచి బుధవారం తహశీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు, కూలిపోయే అవకాశం ఉన్న పాత ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. చిన్నారులు, మహిళలు, గర్భిణులు, వృద్ధులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె చెప్పారు. స్థానికంగా ఉన్న కాలువలు, వాగులు, వంకలు, ఇతర నీటి వనరులు ఉధృతంగా ప్రవహిస్తున్న చోట అటువైపుగా వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వీఆర్‌ఏ, వీఆర్వోలను ఆయా ప్రాంతాల్లో కాపలాగా ఉంచాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేలా అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా సమస్య ఎదురైనా, సహాయం అవసరమైనా ప్రజలు వెంటనే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చేలా కలెక్టరేట్‌లో 1077 టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 16వ తేదీ వరకు 24 గంటలూ పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమును కూడా ఏర్పాటు చేశారు. రెవెన్యూ, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, వైద్య, పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఈ కంట్రోల్ రూములో షిఫ్టులు వారీగా పని చేసేలా విధులు కేటాయించారు. ఇదేవిధంగా మండల, డివిజన్ల స్థాయిలోనూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అత్యధికంగా మద్దిపాడులో 198.4 మి.మీ వర్షం
జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు ఒక్కరోజులో కురిసిన వర్షం ఆగస్టు నెల మొత్తంలో కురవాల్సిన సరాసరి వర్షపాతంలో 28.6 శాతంగా నమోదైంది. జిల్లాలో అత్యధికంగా మద్దిపాడు మండలంలో 198.4 మిల్లీ మీటర్ల వర్షం (19.8 సెంటీ మీటర్లు) కురిసింది. అత్యల్పంగా కొమరోలు మండలంలో కేవలం 4 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఇక మండలాల వారీగా నాగులుప్పలపాడులో 103.4 మి.మీ, కొత్తపట్నంలో 100.6, ఒంగోలు రూరల్ 62.2, ఒంగోలు అర్బన్ 62.2, దర్శి 61.6, సంతనూతలపాడు 46.8, కురిచేడు 41.4, చీమకుర్తి 41.4, తాళ్లూరు 30, మర్రిపూడి 21.8, హనుమంతునిపాడు 21.8, పుల్లలచెరువు 21, త్రిపురాంతకం 20.6, పొదిలి 16.8, యర్రగొండపాలెం 16.4, కొండపి 14.4, టంగుటూరు 14.2, సింగరాయకొండ 13.8, దొనకొండ 13.4, అర్ధవీడు 13.2, పెద్దారవీడు 12.8, కొనకనమిట్ల 12.6, బేస్తవారిపేట 12.6, సీఎస్‌పురం 12.6, మార్కాపురం 12.2, కంభం 11.8, జరుగుమల్లి 10.4, తర్లుపాడు 8.6, ముండ్లమూరు 8.4, కనిగిరి 8, పామూరు 6.8, పొన్నలూరు 6.6, వెలిగండ్ల 6, రాచర్ల 5.4, దోర్నాల 4.6, పెదచెర్లోపల్లి 4.56, గిద్దలూరు 4.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
మరోసారి పొంగిన దొంగలవాగు:
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండల పరిధిలోని పలు వాగులు పొంగి ప్రవహించాయి. దీంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దొంగలవాగు మరో సారి ఉధృతంగా ప్రవహించటంతో కర్నూలు రహదారిలో కొత్తూరు వద్ద ఉన్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ ప్రాంతం వద్ద బుధవారం ఉదయం గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
● రాచర్ల మండలంలో గుండ్లకమ్మ వాగు పరవళ్లు తొక్కుతూ రామన్నకతువ నిండి దిగువకు ప్రవహిస్తోంది. ఆకవీడులోని తురకవాని చెరువు, దొడ్డేని చెరువులు నిండి అలుగుపారుతున్నాయి.
భారీ వర్షాల హెచ్చరికలతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంతో పాటు 1077 నంబరుతో టోల్ ఫ్రీ ఏర్పాటు అత్యధికంగా మద్దిపాడులో 198.4 మి.మీ వర్షపాతం నమోదు దొంగలవాగు పొంగి కర్నూలు మార్గంలో గంట పాటు ట్రాఫిక్‌జాం

బీ అలర్ట్..!

బీ అలర్ట్..!