
వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ శక్తులు
● వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దాడాల సుబ్బారావు
కనిగిరిరూరల్: దేశంలో వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తులు ప్రవేశించి, పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు కుట్ర చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాడాల సుబ్బారావు అన్నారు. స్థానిక వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా 17వ మహాసభల సందర్భంగా రెండో రోజు ప్రతినిధుల సభ బడుగు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దడాల సుబ్బారావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గి పోవడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లేక, అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడి కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో పనులు తగ్గిపోవడం వలన వ్యవసాయ కూలీలు పనులు లేక అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలకు రోజుకు రూ.600 చెల్లించాలని, ఏడాదికి 200ల రోజులు పనిదినాలు పెంచాలని, పనులు లేని రోజుల్లో ఉపాధి కూలీలకు నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలని, నిరుద్యోగ భృతి రూ.3 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు జాలా అంజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు నెరసుల వెంకటేశ్వర్లు, వెల్లంపల్లి ఆంజనేయులు, గుమ్మా బాల నాగయ్య, మల్లెల సంపూర్ణ, ఉబ్బా వెంకటేశ్వర్లు, కంకణాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.