క్రీడల్లో మహిళల సత్తా అభినందనీయం
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు : మహిళలు క్రీడారంగంలోనూ అద్భుతంగా రాణిస్తున్నారని, అత్యంత ప్రతిభతో సత్తా చాటుతుండటం అభినందనీయమని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. 12వ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళా క్రీడాకారులకు ఆదివారం నగరంలోని మినీ స్టేడియంలో ఎస్పీ చేతుల మీదుగా పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని మహిళా క్రీడాకారులు నిరూపిస్తున్నారన్నారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి అలవరచుకోవాలని, జీవితంలో ఎదురయ్యే గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ప్రతిఒక్కరూ తమ పిల్లలను కూడా క్రీడల్లో ప్రోత్సహించాలని, చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా తోడ్పాటునందించాలని అన్నారు. జిల్లా తరఫున ప్రాతినిధ్యం విహించి జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచి వారికి పోలీసు శాఖ తరఫున బహుమతులు ఇస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ సీఐ విజయకృష్ణ, డీఎస్‌డీఓ రాజేశ్వరి, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భక్తధృవుడు, జిల్లా పవర్ లిఫ్టింగ్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


