చోరీ కేసులో మహిళ అరెస్టు
మార్కాపురం: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలిగా నటిస్తూ సుమారు రూ.10 లక్షల విలువైన 127 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేసిన మహిళను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా 24 గంటల్లోనే నిందితురాలిని అరెస్టు చేసి సొమ్ము స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం సీఐ పి.సుబ్బారావు పేర్కొన్నారు. మంగళవారం సీఐ తన కార్యాలయంలో ఎస్సైలు సైదుబాబు, డాక్టర్ రాజమోహన్‌రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చోరీ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు కొమరోలు మండలం బొంతపల్లి గ్రామానికి చెందిన మజ్జారి బాల వెంకటయ్య మార్కాపురం పట్టణంలో ఉన్న తన అన్న మనవడి పెళ్లికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాడు. మార్కాపురం డిపోలో దిగి తన లగేజీని చూసుకోగా బంగారు ఆభరణాలు ఉంచిన బ్యాగ్ కనిపించలేదు. ఆ బ్యాగును ఓ గుర్తుతెలియని వ్యక్తి కంభం సెంటర్‌లో దిగుతూ తీసుకెళ్లినట్లు తోటి ప్రయాణికులు చెప్పారు. పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సీఐ సుబ్బారావు, ఎస్సైలు సైదుబాబు, రాజమోహన్‌రావు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కంభం సెంటర్‌లో ఓ మహిళ అనుమానాస్పద కదలికలను గుర్తించి వివరాలు సేకరించారు. పట్టణంలోని జగదీశ్వరీ థియేటర్ వద్ద నివాసముండే దూదేకుల హుస్సేన్‌బీగా గుర్తించి మంగళవారం ఆమె ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి నుంచి 25 గ్రాముల గోల్డ్ బ్రాస్‌లెట్, 25 గ్రాముల బంగారు చెవిదుద్దులు, 2 గ్రాముల 3 పూసల దండ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ షేక్ షరీఫ్, డి.కోటి నాయక్‌కు రివార్డులు అందించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులను సీఐ సన్మానించారు.
127 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం నిందితురాలిని పట్టించిన సీసీ కెమెరాలు
చోరీ కేసులో మహిళ అరెస్టు


