తెల్ల గ్రానైట్ మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ
హనుమంతునిపాడు: మండల కేంద్రమైన హనుమంతునిపాడు రెవెన్యూ సర్వే నంబర్ 299లో తెల్ల గ్రానైట్ మైనింగ్‌కు సంబంధించి జిల్లా మైనింగ్ అధికారులు, జిల్లా పర్యావరణ అధికారులు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గురువారం తహసీల్దార్ దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో మైనింగ్ నిర్వహించే ప్రదేశంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్ శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. హనుమంతునిపాడు పంచాయతీ సర్వే నంబర్ 299లో 21 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఎర్ర కొండ(బొల్లిగుండ్ల కొండ)లో వైట్ గ్రానైట్ తవ్వకాలకు మిడ్‌వెస్ట్ కంపెనీ 2018లో ఎన్‌ఓసీ పొందిందని తెలిపారు. గత ఏడాది మే నెలలో గనుల తవ్వకానికి మైనింగ్ శాఖ అనుమతి ఇచ్చిందని చెప్పారు. మైనింగ్‌తో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు వెంకట సుబ్బయ్య, గంటా రాఘవేంద్రరెడ్డి తదితరులు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. రోడ్లు నిర్మించడంతోపాటు గుర్రప్పుడు ఆలయానికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. గుడి పక్కన తవ్వకాలు చేపట్టవద్దని, పక్కనే ఉన్న పశువుల కుంటను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా మైనింగ్ అధికారి జి.రాఘవరెడ్డి, ఆర్‌ఐ గవదకట్ల కృష్ణ చైతన్య, సర్వేయర్ రమణయ్య, వీఆర్వోలు చిన్నయ్య, కాశయ్య, బాదుల్లా, ఝాన్సీ, రసూల్, మిడ్‌వెస్ట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.


