తీర్థం పేరుతో మత్తు మందు ఇచ్చి చోరీ | - | Sakshi
Sakshi News home page

తీర్థం పేరుతో మత్తు మందు ఇచ్చి చోరీ

May 2 2025 1:27 AM | Updated on May 2 2025 1:27 AM

తీర్థం పేరుతో మత్తు మందు ఇచ్చి చోరీ

తీర్థం పేరుతో మత్తు మందు ఇచ్చి చోరీ

ఒంగోలు టౌన్‌: గృహదోషం ఉందని పూజలు చేయాలని తీర్థం పేరుతో మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఒంగోలులో సంచలనం సృష్టించింది. పోలీసులు కథనం ప్రకారం..నగరంలోని చైతన్య నగర్లో భూమిరెడ్డి గురుస్వామి రెడ్డి, ప్రసన్న దంపతులు నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో బ్రహ్మం గారి మాల పేరుతో కాషాయ దుస్తులు వేసుకున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్‌ బైకు మీద వచ్చారు. భోజనానికి చందా అడగడంతో ప్రసన్న ఇంట్లోకి వెళ్లి రూ.100 తీసుకువచ్చారు. ఆ తరువాత వచ్చిన ఇద్దరు వ్యక్తులు గురుస్వామి రెడ్డిని పిలిచి నీ ఇంటికి గృహదోషం ఉందని, పూజలు చేయాలని చెప్పారు. అందుకు రూ.30 వేలు ఖర్చు అవుతుందని చెప్పగా..నమ్మిన ఆ దంపతులు రూ.20 వేలకు బేరమాడారు. పూజలో కూర్చున్న కషాయ వేషధారులు గురుస్వామిరెడ్డి దంపతులకు తీర్థం పేరుతో మత్తు మందు ఇచ్చారు. అది తాగిన ఆ దంపతులు మత్తులోకి వెళ్లిపోగా 5 గ్రాముల బంగారు ఉంగరం, రూ.5 వేలతో పరారయ్యారు. కొద్దిసేపటి తరువాత తేరుకొని చూడగా స్వాములు కనిపించలేదు. చోరీ జరిగిన విషయాన్ని తాలుకా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు కాషాయం దుస్తుల్లో ఉన్న నిందితులను గుర్తించినట్లు సమాచారం.

గుర్రం యజ్నేష్‌ అంత్యక్రియలు పూర్తి

ఒంగోలు టౌన్‌: పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒంగోలుకు చెందిన మెడికో గుర్రం యజ్నేష్‌ (21) అంత్యక్రియలు గురువారం మధ్యహ్నం పూర్తయ్యాయి. యజ్నేష్‌ కుటుంబం నగరంలోని భాగ్యనగర్‌ రెండో లైను వాటర్‌ ట్యాంకర్‌ దగ్గర నివాసముంటారు. తండ్రి గురువీర్‌ డెయిరీ నిర్వహిస్తుంటారు. ఆయనకు ఇద్దరు సంతానం కాగా యజ్నేష్‌ పెద్ద కుమారుడు. పది, ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడు. చదువుల్లో ఎంతో చురుగ్గా ఉండే యజ్నేష్‌ కుటుంబసభ్యులతో ఎంతో కలివిడిగా ఉండేవాడు. నెల్లూరులోని ఒక మెడికల్‌ కాలేజీలో చదువుతున్న యజ్నేష్‌ మెడిసిన్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో కూడా మంచి మార్కులతో పాసయ్యాడని కుటుంబ సభ్యులు చెప్పారు. డాక్టర్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబం యజ్నేష్‌ అకాల మరణంతో విషాదంలో కూరుకుపోయింది. తల్లి మల్లీశ్వరిని ఓదార్చడం ఎవరితరం కావట్లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement