
జల్లాపల్లిలో షర్మిలకు కూల్ డ్రింక్స్ అందజేస్తున్న అభిమాని
బోధన్/ కోటగిరి: రాష్ట్రంలో పాలనా వైఫల్యం, అవినీతి, ఎమ్మెల్యేల అరాచకాలు, హామీల అమలు గురించి ప్రజల పక్షాన నిలదీయడం తప్పా అని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నిస్తున్నందున తనపై ఇప్పటికే రెండు మూడు కేసులు కూడా పెట్టారని, ఇప్పుడు మళ్లీ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు పాదయాత్ర చేపట్టానన్నారు. శనివారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా, బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండల కేంద్రంలో ప్రజాప్రస్థాన సభలో వైఎస్ షర్మిల మాట్లాడారు.
తాను మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్రలో ఉండగా, ఆ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారని, దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని, సమాధానం చెప్పేందుకు ఎక్కడికైనా వెళ్లెందుకు సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. దివంగత మహానేత వైఎస్‌ఆర్ హయాంలో మంజీర నదిపై వంతెనలు నిర్మించారని, నిజాంసాగర్ ప్రాజెక్టుకు రూ.440 కోట్లు ఖర్చు పెట్టి ఆధునీకరించారని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఆధునీకరించడం వల్ల ఈ రోజు లక్ష ఎకరాలకు సాగు నీరందుతోందన్నారు.