
సాక్షి, విజయవాడ: జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికపై దాడిని నిరసిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహిళలు ధర్నా చేశారు. మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలు వినతి పత్రం ఇచ్చారు. ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. మహిళపై దాడి చేస్తే హోంమంత్రి స్పందించలేదు. మహిళలపై దాడి చేస్తే అదే చివరి రోజున్న బాబు,పవన్ ఎక్కడ?’’ అంటూ నిలదీశారు.
టీడీపీ ఉన్మాదులను ఉత్పత్తి చేస్తుందంటూ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్ పక్క నియోజకవర్గంలో కూడా పర్యటించకూడదా?. కూటమి పాలనలో ప్రజలు విసుగు చెందుతున్నారు. కచ్చితంగా చంద్రబాబు సర్కార్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.

ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ, ‘‘జడ్పీ చైర్‌పర్సన్‌పై జరిగిన దాడి సిగ్గుచేటు. బీసీ మహిళపై దాడితో సభ్య సమాజం తలదించుకుంటుంది. బీసీలు అంటే బ్యాక్ బోన్స్ అని చెప్పిన చంద్రబాబు.. ఆ బోన్స్ విరిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం.. సంక్షేమంలో రికార్డు లేదు కానీ.. దాడుల్లో రికార్డ్ సాధించింది. గంటసేపు మహిళపై నానా బూతులు మాట్లాడారు.

..దాడి చేయడమే కాకుండా ఉప్పాల రాముపై కేసు నమోదు చేశారు. బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మహిళా సంఘం చైర్మన్ మౌనంగా ఉంది?. చట్టం అందరికీ ఒకటే అనే సంగతి మరిచారా?. తక్షణం హోం మంత్రి, డీజీపీ స్పందించి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలి. దాడి చేయడమే కాకుండా ఉప్పాల హారికని మహానటి అనడం దారుణం’’ అని కల్పలతారెడ్డి మండిపడ్డారు.
