సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి రెండేళ్ల పాలనలో ఏ రైతు సమస్య తీర్చారో మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూసర్వేనే చంద్రబాబు ఎందుకు ఫాలో అవుతున్నారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సర్వేయర్లు వచ్చారు అని తెలిపారు.
మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన పాస్ బుక్‌ల మీద అనగాని పచ్చి అబద్ధాలు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఒక్క పాస్ బుక్ అయినా ఇచ్చారా?. జగన్ హయాంలో ఇచ్చిన పాస్ బుక్‌లు తీసుకుని కొత్త పాస్ బుక్‌లు ఇస్తున్నారు. పాస్ బుక్‌ల మీద వైఎస్ జగన్ ఫొటో తీయడం తప్ప మీరు చేసిందేమిటీ?. రెవెన్యూ మంత్రికి రెవెన్యూ వ్యవస్థ గురించి ఏమైనా తెలుసా?. 1802లో మొట్టమొదటి సారి ఇండియాలో సర్వే చేశారు. 1926-32 వరకు తరువాత బ్రిటీషర్లు సర్వే చేశారు. ఈ సర్వేనే ఇప్పటి వరకు ఇండియాలో కొనసాగుతోంది. రెవెన్యూ మంత్రి అనగాని సంస్కారం మరిచి మాట్లాడారు. మంత్రి అనగాని ఆటవిక సమాజంలోకి పయనిస్తున్నారు. అదృష్టం బాగుండి ఆయన మంత్రి అయ్యారు. రూ.25 కోట్లు తీస్తే పార్టీ మారుతానని చెప్పిన వ్యక్తి అనగాని అని ఎద్దేవా చేశారు.
1995లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి రైతులు ఇబ్బందుల గురించి ఆలోచన చేశారా?. తక్కెళ్లపల్లిలో కూటమి ప్రభుత్వం మొదలు పెట్టిన సర్వే ఎందుకు కొనసాగించడం లేదు. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూసర్వే మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు. మంత్రి అనగాని తన డిపార్ట్‌మెంట్ మీద దృష్టిపెట్టాలి. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూసర్వేలో కొంచెం కూడా తేడా రాదు. జగన్ ఆరు వేల గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తి చేశారు. ఈ ఆరువేల గ్రామాల్లో సర్వే కోసం వాడిన పరికరాలనే బాబు వాడుతున్నారు. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ శాఖ కలిపి ఏపీలో భూ సమగ్ర సర్వే చేపట్టారు. వైఎస్ జగన్ చేపట్టిన డ్రోన్ ప్లే డేటా, ఓఆర్‌ఐ కాపీలను బాబు ప్రభుత్వం వాడుతుంది. శాలిలైట్‌తో లింక్ చేసి వైఎస్ జగన్ సమగ్ర భూ సర్వే చేపట్టారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సర్వేయర్లు వచ్చారు. వైఎస్ జగన్ తెచ్చి సిస్టం ప్రపంచంలోనే అద్భుత భూ సర్వే అని చెప్పుకొచ్చారు.


