సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. చంద్రబాబు లాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అంటూ ఘాటు విమర్శలు చేశారు. కూటమి పాలనలో విద్యార్థులు విద్యను మధ్యలోనే వదిలేసి కూలి పనులకు వెళ్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తున్న పానుగంటి చైతన్యను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూడలేదు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనుకోవడం అవివేకం. పానుగంటి చైతన్య చేసిన నేరం ఏంటి.. విద్యార్థి సమస్యలపై పోరాటం చేయడం తప్పా?. గత ఐదేళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతీ ఏడాది చిత్తశుద్ధితో ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేశారు. కూటమి ప్రభుత్వం ఫీజు రిబర్స్మెంట్ అమలు చేయకపోవడంతో విద్యార్థులను కాలేజీల యాజమాన్యం వేధిస్తున్నాయి.
కళాశాలకు అనుమతించడం లేదు, హాల్ టికెట్ ఇవ్వకుండా, పరీక్షలకు దూరం చేస్తున్నారు. కోర్సు కంప్లీట్ అయినా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కూటమి పాలనలో విద్యార్థులు విద్యను మధ్యలోనే వదిలేసి కూలి పనులకు వెళ్తున్నారు. చంద్రబాబు పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారింది. చంద్రబాబు లాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. భవిష్యత్తులో సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు.


