
సాక్షి, అనంతపురం/తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్ చేసిన సంస్కరణలను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదని హితవు పలికారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదు. వైఎస్ జగన్ పాలనలో మద్యం కుంభకోణం జరగలేదు. కట్టుకథలతో మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ చేసిన సంక్షేమ పథకాలు ఆపడం దారుణం. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి విదేశీ నిధులు ఆపడం దుర్మార్గం. హంద్రీనీవా లైనింగ్ పనులపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి అని వ్యాఖ్యనించారు.
వరదల్లో ఆదుకున్నవి ఇవే కదా: కారుమూరి
తాడేపల్లిలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కానీ, ఆ సంస్కరణలను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారు. రేషన్ డెలివరీ వాహనాల వ్యవస్థను చంద్రబాబు తొలగించారు. ఈ వాహనాల ద్వారా పేదలకు ఎంతో ఉపయోగం జరిగింది. అలాంటి వ్యవస్థను చంద్రబాబు ఎలా నాశనం చేయగలుగుతున్నారు?. ఎండీయూల తొలగింపు ద్వారా 20వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 2.60 లక్షల మంది వాలంటీర్లను కూడా రోడ్డున పడేశారు.

ఇంటింటికీ మద్యం సరఫరా చేస్తూ రేషన్ బియ్యాన్ని ఆపేయటం ఏంటి?. పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ నిలిపేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఫస్ట్ ఎండీయూ వాహనాలు ఆ తర్వాత డిపోలు తొలగిస్తారు. చంద్రబాబుది శాడిస్టు బుద్ధి. అందుకే ప్రజలను పట్టి పీడిస్తున్నారు. గోదావరి వరదలు, విజయవాడ వరదల సమయంలో ఎండీయూ వాహనాలే ఆదుకున్నాయి. ఎండీయూ వాహనదారులకు మేము అండగా నిలుస్తాం. ఆ వాహనాలను కొనసాగించాల్సిందే. లేకపోతే వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎండీయూ వాహనాల ద్వారా ఏం అక్రమాలు జరిగాయో ప్రభుత్వం చెప్పాలి?. సీజ్ ద షిప్ ఎపిసోడ్ ఏమైంది?. ఆ కేసులో ఎంత బియ్యం సీజ్ చేశారో ప్రభుత్వం ఎందుకు చెప్పటం లేదు?. జగన్ సంస్కరణలను నాశనం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం అని మండిపడ్డారు.