
చంద్రబాబు నాయుడు గ్యారెంటీకి పవన్ కల్యాణ్ ష్యూరిటీ అన్నారు. కానీ, చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే!. అందుకే ఆయన ఇంటిపేరు నారా కాదు.. మోసం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
సాక్షి, విజయవాడ: చంద్రబాబు మోసాలను ఎండగడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమం బుధవారం విజయవాడలో జరిగింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ‘‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’’ సమావేశంలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొని ప్రసంగించారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి హయాంలో డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోనే నగదు జమ అయ్యేది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఫెయిల్యూర్ అయ్యింది. జగన్ పర్యటనలకు రాకుండా పోలీసులు అడ్డుపడినా ప్రజలు ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం బుడమేరు ముంపు గ్రామాలకు న్యాయం చేయలేకపోయింది.
మాజీమంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు అంటేనే మోసం.. ఆయన జీవితమే మోసం. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. అందుకే ఆయన ఇంటిపేరు నారా కాదు.. మోసం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఎప్పుడైనా అమ్మ ఒడి గురించి ఆలోచించారా?. చంద్రబాబుకు మాత్రం ఒక్కడే కొడుకు...కానీ ప్రజలను మాత్రం ఇద్దర్ని కనమంటాడు. చంద్రబాబు నాయుడు గ్యారెంటీకి పవన్ కళ్యాణ్ ష్యూరిటీ అన్నారు. ఇప్పుడేమైంది?.
ఏపీలో పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. సత్తెనపల్లిలో 113 మంది పై కేసులు పెట్టారు. ఏపీలో ఐపీఎస్ , ఐఏఎస్ అధికారులను జైలుకు పంపిస్తున్నారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే ఎవరూ భయపడరు .. పారిపోరు. ఎక్కడా తగ్గేదే లేదు సోనియాగాంధీ, చంద్రబాబులను ఎదిరించి జగన్ పార్టీ పెట్టారు. ఆయన చిరంజీవిలాగా పార్టీ పెట్టి పారిపోయిన వ్యక్తి కాదు. మీరు ఎంత తొక్కితే అంత పైకి వచ్చే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.
వంగవీటి మోహనరంగా , వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు. రంగా అనుచరుడిగా ఉన్న మల్లాది విష్ణుకి వైఎస్సార్ ఎమ్మెల్యేగా సీటు ఇచ్చారు. మల్లాది విష్ణు మళ్లీ అసెంబ్లీలో తన కంఠాన్ని వినిపిస్తారు.
విజయవాడ పార్లమెంట్ పరిశీలకులు, మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డిది అబద్దాలు చెప్పే మనస్తత్వం కాదు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచాడు... ప్రజలు ఓడిపోయారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని చూస్తే భారత రాజ్యాంగం గుర్తొస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూస్తే ఆరోగ్య శ్రీ గుర్తుకు వస్తుంది. ఎన్టీఆర్ ను చూస్తే రెండు రూపాయల కిలో బియ్యం గుర్తొస్తుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విగ్రహం పెట్టాలి...అప్పుడు మోసాలు దౌర్జన్యాలు గుర్తుకొస్తాయి. తెలుగుదేశం పార్టీ నేతలే ఇంత మెజార్టీని నమ్మలేకపోతున్నారు. అంబటి రాంబాబులాగా అందరూ ఉత్సాహంగా పనిచేయాలి
డిప్యూటీ మేయర్ ,శైలజారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువు తాండవిస్తుంది. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు.చంద్రబాబు కుటంబానికి మాత్రమే న్యాయం జరిగింది. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ మళ్లీ నిరూపించుకున్నారు. బ్రిటిష్ కాలం నాటి పాలన మళ్లీ మొదలైంది. విజయవాడ ధర్నా చౌక్ లో ప్రతి రోజూ ప్రభుత్వం పై ధర్నాలు జరుగుతున్నాయి. మెడికల్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. చంద్రబాబు కాన్వాయ్ వద్ద ప్రజలు ఎవరూ లేరు. జగన్ కాన్వాయ్ వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం దగ్గరపడింది.
పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు మేక తోలు కప్పుకున్న పులి. పల్నాడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చంద్రబాబు హత్య చేయించారు. నాలుగు లక్షల మంది వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ కి దక్కింది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు , నాయకులు , కార్యకర్తలు హాజరయ్యారు.