
వైఎస్సార్ కడప, సాక్షి: చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నారని కడప వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కొప్పర్తి సేజ్‌కి వచ్చిన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపు చంద్రబాబు నైజానికి నిదర్శనమని దుయ్యబట్టారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తి సేజ్‌కు కేటాయించిన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపుపై గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఆయన మాట్లాడారు.
‘‘ఇది సీమ యువత అవకాశాలను దెబ్బ తీయడమే. ప్రభుత్వం జీవో నంబర్ 56 వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నారు. దానికి కొప్పర్తి సేజ్‌కి వచ్చిన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపే నిదర్శనం’’ అని అన్నారు.
కేంద్రం కేటాయించిన టెక్నాలజీ సెంటర్‌ను మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా నిలదీశారు. రాయలసీమకు వచ్చిన ప్రతి ఒక్క సంస్థను తీసుకెళ్ళిపోతున్నారు. పులివెందుల మెడికల్ సీట్లు వెనక్కి పంపారు. రాయలసీమ వాడిని అని చెప్పుకునే చంద్రబాబు.. ఇలాంటి చర్యలకు పాల్పడటం దౌర్భాగ్యం. రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారాయన.
కేంద్రం ఇక్కడి యువతకు ఇచ్చిన టెక్నాలజీ సెంటర్‌ను తరలించడానికి చంద్రబాబు ఎవరని కడప సీపీఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర ప్రశ్నించారు. ‘‘ ఇది క్షమించరాని నేరం. ఇలాంటి చర్యలు యువత అవకాశాలను దెబ్బ తీస్తాయి. ఈ అంశంపై అఖిలపక్షంగా పోరాడతాం’ అని అన్నారు.
ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను తరలించడం అంటే సీమకు అన్యాయం చేయడమేనని కడప జిల్లా సీపీఎం కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. ‘‘ ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలు చేపట్టడం దారుణం. నైపుణ్యాలను రాయలసీమ యువతకు అందించాల్సిన అవసరం లేదా?. ప్రభుత్వం మారగానే ఇలా చేయడం సరికాదు’ అని అన్నారు.
రౌండ్ టెబుల్ సమావేశానికి కడప వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకుడు సత్తార్, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హాజరయ్యారు.