‘జగన్‌ పాలన సంక్షేమం.. చంద్రబాబు పాలన సంక్షోభం’ | Ysrcp Leader Bhumana Karunakar Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘జగన్‌ పాలన సంక్షేమం.. చంద్రబాబు పాలన సంక్షోభం’

Jun 7 2026 12:49 PM | Updated on Jun 7 2026 1:33 PM

Ysrcp Leader Bhumana Karunakar Reddy Fires On Chandrababu

సాక్షి, తిరుపతి: రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం ఐదేళ్లు పట్టి పీడిస్తూనే ఉంటుందని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అంటే తెలివిగా దోచుకునే పార్టీ, తెలుగు దొంగల పార్టీగా అభివర్ణించారు. కార్యకర్తల పేరుతో రౌడీలను పెంచిపోషిస్తున్నారంటూ భూమన మండిపడ్డారు.

‘‘వైఎస్‌ జగన్‌ పాలన సంక్షేమం.. కూటమి పాలన సంక్షోభం. సూపర్‌ సిక్స్‌ పథకాలు.. సూపర్‌ సిక్స్‌ మోసాలు. కూటమి ప్రభుత్వాన్ని ముంచే ప్రభుత్వమని ప్రజలు అనుకుంటున్నారు. ఆడబిడ్డ నిధి ఎక్కడని మహిళలు ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగ భృతి ఎక్కడని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని చంద్రబాబు ఎగ్గొట్టారు. ఫ్రీ బస్సు కస్సుబుస్సులా తయారైంది. దీపం పథకం పేదల పాలిట శాపంగా మారింది. గ్రాఫిక్‌తో గ్యాస్‌ కొడుతూ వెలగని దీపాన్ని చంద్రబాబు ఇస్తున్నారు’’ అంటూ భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘చంద్రబాబు పాలనలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. అన్నదాతలకు కష్టకాలం.. చంద్రన్న దాతలకు సుఖీభవ. ప్రభుత్వ ఉద్యోగులను నిండా ముంచారు. విద్యారంగం కూటమి పాలనలో హీన దశకు వెళ్లింది. కూటమి పాలనలో పాఠశాలలు నిర్వీర్యమయ్యాయి, ప్రభుత్వ పాఠశాలలకు చంద్రగ్రహణం పట్టింది. ఆంధ్రప్రదేశ్‌ను అప్పులప్రదేశ్‌గా మార్చారు. తాగుదాం ఆంధ్రాగా రాష్ట్రాన్ని చంద్రబాబు మార్చారు. ఇంటింటికి కాదు.. వీధివీధికి బెల్ట్‌ షాపు తెచ్చారు. గోల్కొండ కట్టింది నేనే, సముద్రాన్ని తవ్వించింది నేనే అని బాబు చెప్పగలరు’’ అని భూమన ఎద్దేవా చేశారు.

‘‘ఎన్టీఆర్‌ను ఒక్కసారి వెన్నుపోటు పొడిచారు, ప్రజలను అనునిత్యం పొడుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను బానిసలుగా చూస్తున్నారు. చంద్రబాబు ధర్మపరిరక్షకుడు పవన్‌ కల్యాణ్‌. లోకేష్‌ సేవలో పవన్‌ లోకాలు మరిచిపోతున్నారు’’ అంటూ భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.

 

Advertisement
 
Advertisement
Advertisement