వాళ్ల వ్యక్తి ఆ సీటులో లేకపోతే హాజరుకారా?

YSRCP Comments On TDP, Jansena and BJP for boycott SEC Meeting - Sakshi

ఎస్‌ఈసీ సమావేశాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ బాయికాట్‌ చేయడాన్ని తప్పుపట్టిన వైఎస్సార్‌సీపీ  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) పట్ల రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీల వైఖరి ఒక్క రోజులోనే మారిపోయిందని వైఎస్సార్‌సీపీ తప్పుపట్టింది. ఆ పార్టీలకు కావాల్సిన వ్యక్తి, చెప్పినట్టు నడిచే వ్యక్తి ఆ స్థానంలో లేకపోతే ఎస్‌ఈసీ నిర్వహించే సమావేశాలకు రాని పరిస్థితి ఏర్పడిందని విమర్శించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం ఎస్‌ఈసీ నీలం సాహ్ని అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.  వైఎస్సార్‌సీపీ, సీపీఎం, కాంగ్రెస్, బీఎస్పీ, ఫార్వర్డ్‌ బ్లాక్, ముస్లింలీగ్, సమాజ్‌వాది, టీఆర్‌ఎస్‌ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.  సమావేశం అనంతరం.. అందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ కార్యదర్శి ఎల్‌.అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకపోవడం దురదృష్టకరమన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏడాది కిందట మధ్యలో ఆగిపోయాయని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఆగిన చోటునుంచే మొదలు పెట్టాలని చెప్పారు. గత ఎస్‌ఈసీ వాటి జోలికి పోకుండా పంచాయతీ ఎన్నికలు, మునిసిపల్‌ ఎన్నికలు పూర్తిచేశారని గుర్తుచేశారు. అప్పట్లో మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ప్రస్తుత ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీలు తప్పులు పడుతున్నాయని విమర్శించారు.  

ఎక్కువ రోజులు ప్రత్యేకాధికారుల పాలన మంచిది కాదు: సీపీఎం 
స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలన ఎక్కువ రోజులు కొనసాగడం మంచిది కాదని, ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల పాలన కొనసాగాలన్నది తమ పార్టీ విధానమని సీపీఎం ప్రతినిధిగా హాజరైన వై.వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సహకారం తెలిపామన్నారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్‌ ప్రతినిధి మస్తాన్‌వలి.. తాము బహిష్కరిస్తున్నట్టు చెప్పి బయటికొచ్చినట్టు తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top